దీపావళి గిఫ్ట్ గా లేఆఫ్ లెటర్.. ఓ కంపెనీ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్ వైరల్

దీపావళి గిఫ్ట్ గా లేఆఫ్ లెటర్.. ఓ కంపెనీ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్ వైరల్

పండుగ వేళ కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఉద్యోగులు కూడా దీపావళి సమయానికి జీతం, బోనస్‌, సెలవులతో కొంత ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఓ ఉద్యోగికి మాత్రం పండుగకు ముందు ఊహించని షాక్‌ ఎదురైంది. దీపావళి సమీపిస్తున్న వేళ కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ ఉద్యోగి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆ ఉద్యోగి రెడ్డిట్‌లో షేర్ చేశాడు. హెచ్‌ఆర్‌ నుంచి ఉద్యోగం కోల్పోతున్నట్లు సమాచారం అందుకున్న క్షణంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని తెలిపాడు. తన వృత్తి జీవితం ఇప్పుడిప్పుడే స్థిరపడుతోందని భావిస్తున్న సమయంలో ఈ పరిణామం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ నిర్ణయం తన వ్యక్తిగత జీవితంపైనా ప్రభావం చూపిందని ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్‌లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నానని, ఇప్పుడు ఆదాయం లేకపోవడంతో ఆ ప్రయాణం కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని తెలిపాడు. ఉద్యోగం లేని వ్యక్తిగా మిగిలిపోతానేమోనని ఆందోళన చెందుతున్నట్లు పోస్ట్ లో రాశాడు. మార్కెటింగ్ రంగంలో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌, పెర్ఫార్మెన్స్ మార్కెటర్‌, యాడ్స్ మేనేజర్ వంటి పోస్టులు ఉంటే సమాచారం ఇవ్వాలని నెటిజన్లను కోరాడు.

ఈ పోస్ట్‌పై పలువురు స్పందిస్తూ అతడికి ధైర్యం చెప్పారు. మరికొందరు తమకు కూడా పండుగల ముందు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలు, ఆర్థిక ప్రణాళికలు, పండుగ సంతోషాలు ఇలాంటివి ఏమీ పట్టకుండా నిర్ణయాలు ప్రకటించడం ఎంతటి మానసిక ఒత్తిడికి కారణమవుతుందో  నెటిజన్లు చర్చకు పెట్టారు. వ్యాపార అవసరాల పేరుతో లేఆఫ్స్‌ తప్పనిసరి కావచ్చేమో కానీ, వాటిని ప్రకటించే సమయం, విధానం విషయంలో కంపెనీలు కనీస మానవీయత పాటించాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.