ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు: కవిత

ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదు: కవిత

నల్గొండ:  ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లను తీసుకురావడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. గోదావరి, కృష్ణా నదుల జలాలను వినియోగించుకుంటేనే నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే డిండి ప్రాజెక్టుకు నీటి వనరులపై స్పష్టత ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

మల్లన్నసాగర్, బస్వాపురం, శివన్నగూడెం రిజర్వాయర్ల నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ద్వారానే నల్గొండ జిల్లాకు శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  నిలదీశారు. ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పనులను పూర్తి చేయలేకపోయిందని, ప్రస్తుతం కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.

నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే భూగర్భ జలాలు పెరగాలని, ఇందుకోసం సుమారు 40 ఏళ్ల పాటు భూమి తడిసేలా సాగునీటి వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే 80 శాతం పనులు పూర్తయిన బస్వాపురం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, గోదావరి–కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారానే నల్గొండ జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని కవిత  విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలకు చరమగీతం పాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజలకు మంచి అవకాశమన్నారు.