ఎన్ని జన్మలెత్తినా నక్క పులి కాదు.. గడ్డం పెంచితే రేవంత్ రెడ్డివి అవుతావా?.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు

ఎన్ని జన్మలెత్తినా నక్క పులి కాదు.. గడ్డం పెంచితే రేవంత్ రెడ్డివి అవుతావా?.. కేటీఆర్‌పై సీఎం  సెటైర్లు

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై  సీఎం రేవంత్ రెడ్డి  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కేటీఆర్ వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. తనకు గడ్డం ఉందని కేటీఆర్ కూడా గడ్డం పెంచుతున్నారని, గడ్డం పెంచినంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఎన్ని జన్మలెత్తినా తనలా కాలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేషాలు మార్చినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు.

కేటీఆర్‌పై  ఘాటు వ్యాఖ్యలు

తనను అనుకరిస్తే రేవంత్ రెడ్డి కాలేరని సీఎం వ్యాఖ్యానించారు. తనకు గడ్డం రావడానికే కేటీఆర్‌కు 50 ఏళ్లు పట్టిందని, మరి బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. నక్క ఎప్పటికీ పులి కాలేదని వ్యాఖ్యానించారు.కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవడం అంటే వారికి మంచి పనులు చేసి చూపించాలని రేవంత్ రెడ్డి అన్నారు.

 గత పదేళ్లలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారు. ఎల్‌నినో ప్రభావం, సాగునీటి ప్రాజెక్టులు, 22ఏ భూముల అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మామ, అల్లుడు, కొడుకు కలిసి ఏనాడైనా ఒక్క నిజం చెప్పారా అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను ప్రశ్నించారు.

సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం

సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతామని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను వేయకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు.