హైదరాబాద్: పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను సొంత ప్రాంతం కానప్పటికీ ఎంపీగా గెలిపించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లలో రూ.20 లక్షల కోట్లకు పైగా తెలంగాణ బడ్జెట్ ఉన్నప్పటికీ కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఆరోపించారు. ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనుక అవినీతి, నాణ్యతా లోపాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలమూరు ప్రాంతానికి న్యాయం చేస్తారని ఆశించామని, కానీ కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే అవకాశం ఉన్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తామని చెప్పినా, దానిని పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం అంచనా వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి సుమారు రూ.1.5 లక్షల కోట్లకు పెంచారని, అంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతిందని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీ అంశంపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. మేడిగడ్డలో 16 టీఎంసీల నీరు ఉంటేనే ఎత్తిపోతలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో కన్నెపల్లి పంపులు పనిచేయడం లేదని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై తాము సీబీఐ విచారణ కోరామని, అయితే విచారణ జరగకుండా అడ్డుకున్నది ఎవరని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్ల నిర్వహణ విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని అన్నారు.
ALSO READ : మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తాం
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్గొండ ప్రాంతానికి నీళ్లు అందించే అవకాశం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నుంచి కూడా నీటి సరఫరాకు అవకాశం ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని అందిస్తున్నామని, తుపాకులగూడెంకు కూడా అక్కడి నుంచే నీటిని తరలిస్తున్నామని వివరించారు.వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే ప్రస్తుతం తెలంగాణలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతోందన్నారు.
ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని, తెలంగాణలోనూ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అసెంబ్లీలో భూముల అంశంపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తెలంగాణకు కొడంగల్ ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాంతాన్ని గతంలో పాలకులు పట్టించుకోలేదని, ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు.మక్తల్-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొడంగల్ అభివృద్ధి చెందుతుండటాన్ని కొందరు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొడంగల్‌కు రావాల్సిన పరిశ్రమలను సిరిసిల్లకు తరలించారని ఆరోపించారు.
