రాత్రిపూట త్వరగా నిద్ర పట్టాలంటే ఈ 7 రకాల డ్రింక్స్ తాగండి.. మంచి నిద్ర మీ సొంతం!

రాత్రిపూట త్వరగా నిద్ర పట్టాలంటే ఈ 7 రకాల డ్రింక్స్ తాగండి.. మంచి నిద్ర మీ సొంతం!

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజూ రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టయిల్, పని ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్ వాడకం వంటి కారణాలతో చాలామందికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు.

నిద్ర సరిగా లేకపోతే రోజంతా అలసటగా ఉండటమే కాకుండా, ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ కాలం పాటు నిద్రలేమి సమస్య ఉంటే డిప్రెషన్, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరగవచ్చు. అయితే రాత్రిపూట పడుకునే ముందు కొన్ని రకాల డ్రింక్స్  తీసుకోవడం వల్ల శరీరం ప్రశాంతంగా మారి నిద్ర పట్టేందుకు కొంతవరకు సహాయపడవచ్చు. అలాంటి 7 డ్రింక్స్  ఏంటో తెలుసుకుందాం.....

1. చామంతి టీ
చామంతి పూలతో తయారుచేసే ఈ టీ ఆరోగ్యానికి చాల విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో  సహాయపడవచ్చని భావిస్తారు. 2024లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, చామంతి టీ తీసుకోవడం వల్ల నిద్ర మధ్యలో మేల్కొనే సమస్య కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే నిద్రపోయే మొత్తం సమయం లేదా పగటిపూట పనితీరుపై స్పష్టమైన ప్రయోజనాలు కనిపించలేదు.

చామంతి టీ ఎలా తయారుచేయాలి?
ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండిన చామంతి పూలు వేయాలి. సుమారు 5 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

2. అశ్వగంధ టీ 
అశ్వగంధ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఈ మూలికను ఉపయోగిస్తున్నారు. దీనిని ఇండియన్ జిన్సెంగ్ అని కూడా పిలుస్తారు. అశ్వగంధ శరీరంలోని ఒత్తిడిని తగ్గించడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2021లో జరిగిన ఒక అధ్యయనంలో అశ్వగంధ సారం తీసుకున్నవారిలో నిద్ర నాణ్యత కొంత మెరుగుపడినట్లు గుర్తించారు.

అశ్వగంధను టీ రూపంలో తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడి, యాలకుల పొడి, దాల్చినచెక్క, కొద్దిగా జాజికాయ కలిపి తయారుచేసే పానీయాన్ని 'మూన్ మిల్క్' అంటారు. అయితే అశ్వగంధ అందరికీ సరిపోదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, థైరాయిడ్ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు, మందులు వాడుతున్నవారు వైద్యుల సలహా లేకుండా తీసుకోకూడదు.

3. వలేరియన్ టీ  
వలేరియన్ అనేది ఔషధ గుణాలు కలిగిన ఒక మొక్క. ఈ మొక్క వేరును సంప్రదాయ వైద్యంలో నిద్రకు సంబంధించిన సమస్యల కోసం ఉపయోగిస్తారు.

కొన్ని పరిశోధనల్లో వలేరియన్ నిద్ర నాణ్యతను పెంచడంలో  సహాయపడవచ్చని తేలింది. 2020లో ప్రచురించిన ఒక కధనంలో కూడా వలేరియన్ వల్ల నిద్రకు సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం.

వలేరియన్ టీ ఎలా తయారుచేయాలి?

ఒక కప్పు వేడి నీటిని తీసుకోవాలి. అందులో 2 నుంచి 3 గ్రాముల ఎండిన వలేరియన్ వేరును వేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత వడకట్టి తాగాలి. వలేరియన్ వల్ల కొందరికి మత్తు లేదా తల తిరగడం రావచ్చు. నిద్రమాత్రలు లేదా ఇతర మత్తు కలిగించే మందులతో కలిపి తీసుకోకూడదు.

4. పుదీనా టీ 
పుదీనాను వంటల్లోనే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. పుదీనా ఆకులతో తయారుచేసే టీ మంచి సువాసనతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి పుదీనా కొంత రిలీఫ్ కలిగించవచ్చు. రాత్రిపూట వేడివేడి పుదీనా టీ తాగడం వల్ల శరీరం, మనసు ప్రశాంతంగా మారవచ్చు.

పుదీనా టీ ఎలా తయారుచేయాలి?
ముందుగా రెండు కప్పుల నీటిని మరిగించాలి. అందులో కొన్ని తాజా పుదీనా ఆకులు వేయాలి. కనీసం 5 నిమిషాలు నానబెట్టాలి.
తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగాలి. అయితే పుదీనా టీ నేరుగా నిద్రను కలిగిస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. ఎసిడిటీ లేదా రిఫ్లక్స్ సమస్య ఉన్నవారిలో పుదీనా టీ కొన్నిసార్లు ఇబ్బందిని పెంచవచ్చు.

5. గోరువెచ్చని పాలు 
రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం మన ఇళ్లలో చాలాకాలంగా ఉన్న అలవాటు. పెద్దలు కూడా నిద్ర సరిగా పట్టకపోతే పాలు తాగాలని చెబుతుంటారు. దీనికి ఒక కారణం పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం. ఇది శరీరంలో సెరోటోనిన్ తయారవడానికి సహాయపడుతుంది. సెరోటోనిన్ నుంచి నిద్రకు సంబంధించిన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది.

అందువల్ల పాలు తాగడం నిద్రకు సహాయపడే ఒక మంచి అలవాటుగా ఉండవచ్చు. అలాగే పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

ఎలా తీసుకోవాలి?
ఒక గ్లాసు పాలను కొద్దిసేపు వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా పసుపు లేదా యాలకుల పొడి కలుపుకోవచ్చు. పాల వల్ల అలర్జీ లేదా లాక్టోస్ అసహనం ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

6. బాదం పాలు 
బాదంపప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటితో తయారుచేసే బాదం పాలు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరం. మెగ్నీషియం నిద్రకు కూడా సంబంధం ఉంటుంది.

ఒక కప్పు బాదం పాలలో సుమారు 17 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. అయితే బాదం పాలలో పోషకాల పరిమాణం తయారీ విధానం, బ్రాండ్‌ను బట్టి మారుతుంది.

ఎలా తీసుకోవాలి?
రాత్రిపూట ఒక కప్పు బాదం పాలను గోరువెచ్చగా చేసి తాగవచ్చు. మార్కెట్‌లో దొరికే బాదం పాలను ఉపయోగించవచ్చు లేదా ఇంట్లోనే బాదంపప్పులతో తయారుచేసుకోవచ్చు.

అయితే బాదంపప్పు అలర్జీ ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకోకూడదు. అలాగే బాదం పాలు తాగడం వల్ల నిద్ర లేకపోవడం  తగ్గుతుందని బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

7. అరటిపండు - బాదం స్మూతీ 
అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే బాదంపప్పులో కూడా మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి స్మూతీ తయారుచేసుకుని తాగవచ్చు. ఇది శరీరానికి పోషకాలు అందించడంతో పాటు రాత్రిపూట లైట్ డ్రింక్ గా ఉపయోగపడుతుంది.

అరటిపండు - బాదం స్మూతీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఒక అరటిపండు, ఒక కప్పు బాదం పాలు, ఒక టేబుల్ స్పూన్ బాదం వెన్న, అర కప్పు ఐస్ ముక్కలు

తయారీ విధానం:
ముందుగా అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో అరటిపండు, బాదం పాలు, బాదం వెన్న వేయాలి. ఐస్ ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేయాలి. మెత్తగా స్మూతీలా తయారైన తర్వాత గ్లాసులో పోసుకుని తాగాలి. మీకు నచ్చితే ఇందులో పెరుగు, అవకాడో లేదా ఇతర పండ్లను కూడా కలుపుకోవచ్చు. అయితే ఎక్కువ చక్కెర కలపకుండా తయారుచేసుకోవడం మంచిది.

మంచి నిద్ర కోసం ఈ విషయాలు గుర్తుంచుకోండి
నిద్ర పట్టడానికి ఈ డ్రింక్స్  కొంతవరకు సహాయపడవచ్చు. అయితే ఇవి నిద్రలేకపోవడానికి  మందులు కావు. ప్రతి ఒక్కరిపై ఒకే విధంగా ప్రభావం చూపకపోవచ్చు. మంచి నిద్ర కోసం కొన్ని అలవాట్లు కూడా పాటించాలి.

*ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోండి.
*పడుకునే ముందు మొబైల్, టీవీ వాడకాన్ని తగ్గించండి.
*రాత్రిపూట కాఫీ, టీ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకండి.
*నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండండి.
*పడుకునే గదిలో వెలుతురు, శబ్దం తక్కువగా ఉండేలా చూసుకోండి.
*రోజూ కొంత సమయం వ్యాయామం చేయండి.

ముఖ్యంగా: నిద్రలేకపోవడం సమస్య తరచుగా వస్తుంటే లేదా ఎక్కువకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి  డ్రింక్స్ పై మాత్రమే ఆధారపడకూడదు.