విశాఖపట్నం: విశాఖపట్నంలోని గోకుల్ పార్క్ బీచ్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు యువతీ యువకులు ఒక్కసారిగా ఎగసిపడిన సముద్ర అలల ధాటికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు గల్లంతు కావడంతో బీచ్ వద్ద ఆందోళన నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. పరవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు గోకుల్ పార్క్ బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఐదుగురూ సముద్ర స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా భారీ అలలు రావడంతో వారంతా సముద్రంలోకి కొట్టుకుపోయారు.ఈ ఘటనను గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి ముగ్గురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు.
గల్లంతైన వారిలో పదో తరగతి విద్యార్థి!
గల్లంతైన వారిలో కరణం వెంకటి అనే పదో తరగతి విద్యార్థి ఉన్నట్లు సమాచారం. మరో యువకుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన ఇద్దరి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ముగ్గురు ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మరో ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గోకుల్ పార్క్ బీచ్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రంలో స్నానాలకు వెళ్లే సమయంలో సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితుల్లో సముద్రంలోకి దిగవద్దని సూచిస్తున్నారు.
