2027 డిసెంబర్ నాటికి శంషాబాద్-కొడంగల్ రేడియల్ రోడ్డు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

2027 డిసెంబర్ నాటికి  శంషాబాద్-కొడంగల్ రేడియల్ రోడ్డు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్: కొడంగల్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (RARE) ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధితో ఈ ప్రాంతంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. 2027 డిసెంబర్ నాటికి శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు.

కొడంగల్‌లో ఇండస్ట్రియల్ హబ్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి దాదాపు 100 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఏరోస్పేస్, రక్షణ రంగం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, వస్త్ర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొడంగల్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంతం, ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు చెందిన పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నాలుగు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం

రేర్ ఇండస్ట్రియల్ హబ్‌తో పాటు NARI (Network of Apparel Readiness & Infrastructure) పార్క్, THRIVE హబ్, RISE (Regional Industries & Small Enterprises) ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్‌ను గొప్ప పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడం తన బాధ్యత మాత్రమే కాదని, అదొక కల అని పేర్కొన్నారు. “కొడంగల్‌తోనే నా గుర్తింపు, ఆత్మగౌరవం” అని వ్యాఖ్యానించారు.

70 నిమిషాల్లోనే కొడంగల్‌కు చేరుకునే అవకాశం

కొడంగల్ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో అనుకూలమైనదని సీఎం తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఇండస్ట్రియల్ హబ్‌లో నిర్మాణాలు ప్రారంభించాయని, మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.

శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డుతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, కేవలం 70 నిమిషాల్లో కొడంగల్ చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే ముందు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పారిశ్రామిక పార్కు ఎంత దూరంలో ఉందనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తాయని చెప్పారు. విమానాశ్రయానికి సమీపంలో ఉండటం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరమన్నారు.

250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్

పరిశ్రమల ఏర్పాటుతో పాటు భావితరాలకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 250 ఎకరాల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, టాటా టెక్నాలజీస్ సహకారంతో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందిస్తామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ కోర్సులను అందుబాటులోకి తీసుకురావచ్చని వివరించారు.

పారిశ్రామిక అభివృద్ధికి వ్యూహాత్మక ప్రాంతం

కొడంగల్ భౌగోళికంగా ఎంతో కీలకమైన ప్రాంతమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.రానున్న రోజుల్లో చందన్‌వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో కొడంగల్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనున్నట్లు స్పష్టం చేశారు.