ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ రీలాంచ్!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మోస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ రీలాంచ్!

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త కస్టమర్ల చేరిక తగ్గిపోవటంతో.. గతంలో నిలిపివేసిన మోస్ట్ పాపులర్ రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 1 జీబీ డేటా, 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్‌ను గత ఆగస్టులో తొలగించారు. ప్రస్తుత మార్కెట్ పోటీని, వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ARPU అంటే ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.271గా ఉంది. అయితే అంతకుముందు క్వార్టర్‌లో 33 లక్షలుగా ఉన్న నికర కస్టమర్ల చేరిక.. సెప్టెంబర్ త్రైమాసికానికి వచ్చేసరికి 7.16 లక్షలకు పడిపోయింది. ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ల ధరలు విపరీతంగా పెరగడం, షిప్‌మెంట్లు మందగించడం వల్లే ఈ క్షీణత ఏర్పడిందని ఎయిర్‌టెల్ సీఈఓ శాశ్వత్ శర్మ తెలిపారు. అయినప్పటికీ దేశంలో పెరుగుతున్న రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్.. 2G, 4G, 5Gకి మళ్లే కస్టమర్లకు సహకరిస్తోందని అన్నారు. 

సగటు ఆదాయాన్ని మరింత స్థిరంగా ఉంచుకోవడానికి ఎయిర్‌టెల్ కస్టమర్ అప్‌గ్రేడ్‌లు, పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు, అంతర్జాతీయ రోమింగ్ సర్వీసులపై ప్రధానంగా దృష్టి సారించింది. భవిష్యత్తులో టెలికాం ఆపరేటర్లు వాస్తవిక డేటా వినియోగానికి తగినట్లుగా టారిఫ్ విధానాలను రూపొందించాల్సి ఉంటుందని సీఈఓ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే వరకు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(FWA) సేవలను కేవలం తాత్కాలిక బ్రాడ్‌బ్యాండ్ ప్రత్యామ్నాయంగా మాత్రమే చూస్తూ.. దాని విస్తరణను కొద్దిగా నియంత్రిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ALSO READ : లేఆఫ్స్‌లోనూ మానవత్వం.. కాన్వా అందిస్తున్న భారీ ఎగ్జిట్ ప్యాకేజీపై ఉద్యోగుల ప్రశంసలు

కేవలం టెలికాం రంగానికే పరిమితం కాకుండా టెక్నాలజీ, క్లౌడ్, మౌలిక వసతుల విస్తరణపై ఎయిర్‌టెల్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. విశాఖపట్నంలో ఇటీవల సేకరించిన భూమిలో 400 నుంచి 500 మెగావాట్ల సామర్థ్యంతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా కంపెనీ డేటా సెంటర్ సామర్థ్యాన్ని ఒక గిగావాట్‌కు పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. AI, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్‌టెల్ ఫైనాన్స్ సేవలతో భవిష్యత్తులో డిజిటల్ రంగంలో మరింత బలమైన స్థానాన్ని దక్కించుకోవాలని ఎయిర్‌టెల్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.