వారానికి 48 గంటలే డ్యూటీ.. ఉస్మానియా హాస్పిటల్లో జూడాల పనిగంటలపై సూపరింటెండెంట్ సర్క్యులర్

వారానికి 48 గంటలే డ్యూటీ.. ఉస్మానియా హాస్పిటల్లో జూడాల పనిగంటలపై సూపరింటెండెంట్ సర్క్యులర్
  • రెండు రోజులు 12 గంటలు.. నాలుగు రోజులు 6 గంటల షిఫ్టులు
  • వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలని హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ లో పనిచేసే జూనియర్ రెసిడెంట్లు, హౌస్‌‌‌‌‌‌‌‌ సర్జన్ల (ఇంటర్న్లు) పనివేళలను వారానికి 48 గంటలకే పరిమితం చేస్తూ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ సర్క్యులర్ జారీ చేశారు.

నూతన నిబంధనలకు అనుగుణంగా డ్యూటీ రోస్టర్లను రూపొందించి, ప్రతినెలా 28వ తేదీ నాటికి సమర్పించాలని హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలను ఆదేశించారు. నూతన విధానం ప్రకారం వారంలో రెండు రోజులు 12 గంటల చొప్పున, మిగిలిన నాలుగు రోజులు 6 గంటల చొప్పున మాత్రమే షిఫ్టులు కేటాయించాలి. ప్రతి జూనియర్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ కు వారంలో ఒక సెలవును ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 72 గంటల పని..
ప్రస్తుతం దవాఖానల్లో జూడాలు వారానికి సగటున 75 నుంచి 100 గంటల పాటు విధుల్లో గడపాల్సి వస్తోంది. సాధారణ డ్యూటీలతో పాటు వారంలో కనీసం ఒకరోజు 24 గంటల నిరంతర ఎమర్జెన్సీ డ్యూటీ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో లేదా రోస్టర్ కుదరనప్పుడు కొందరు 36 నుంచి 48 గంటల పాటు నిద్ర, విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తోంది.

ఈ పని ఒత్తిడి వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. పనివేళలు 48 గంటలకు తగ్గడం వల్ల జూడాలకు మానసిక, శారీరక అలసట తగ్గి, పూర్తి ఏకాగ్రతతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని జూడాలు చెబుతున్నారు. పీజీ వైద్య విద్యార్థులకు క్లినికల్ డ్యూటీలతో పాటు చదువు, రీసెర్చ్ లకు అవసరమైన సమయం దొరుకుతుందంటున్నారు.

9 దవాఖానలు.. 700 మంది జూడాలు
ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉస్మానియాతో పాటు నీలోఫర్, పేట్లబుర్జు మెటర్నిటీ, సుల్తాన్ బజార్ మెటర్నిటీ, సరోజినీదేవి కంటి, కోఠి ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ, నల్లకుంట ఫీవర్, ఎర్రగడ్డ చెస్ట్, మెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ అన్ని దవాఖానల్లో కలిపి సుమారు 700 నుంచి 1000 మంది జూనియర్ రెసిడెంట్లు  క్షేత్రస్థాయి సేవలందిస్తున్నారు.

ప్రస్తుతం ఉస్మానియా సూపరింటెండెంట్ మాత్రమే సర్క్యులర్ ఇవ్వగా, త్వరలోనే ఓఎంసీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ తో పాటు మిగిలిన అనుబంధ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు కూడా ఇదే నిబంధనను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.