వెలుగు స్పెషల్ : 100వ ఏట అడుగెడుతున్న భారతరత్న ఎల్‌‌‌‌‌‌‌‌కే అద్వానీ!

వెలుగు స్పెషల్ : 100వ ఏట అడుగెడుతున్న భారతరత్న ఎల్‌‌‌‌‌‌‌‌కే అద్వానీ!

శ్రీ లాల్‌‌‌‌‌‌‌‌కృష్ణ అద్వానీ... భారత రాజకీయ చరిత్రలో పరిచయం అవసరంలేని పేరు.  నేడు నవంబరు 8న ఆయన శతాయుష్కుల జాబితాలోకి చేరనున్నారు. ఈ ఏడాది ఆయన నూరవ పుట్టినరోజు దీపావళి పండుగతో జమిలిగా రావడం విశేషం. 

శ్రీరామ ప్రభువు విజయానికి, వెలుగు దివ్వెకు ప్రతీక అయిన ఈ పండుగ సమయం, జనసంఘ్ ఆవిర్భావానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భం, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి, ఇటీవలే ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ శత వసంతోత్సవం నిర్వహించుకోవడం తదితరాలన్నీ ఈ సంవత్సరం ఆయన జన్మదినంతో ముడిపడటం ముదావహం.  

ఆధునిక భారత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలతో  పెనవేసుకున్న సుదీర్ఘ జీవితం ఆయనది.  అద్వానీ 1927 నవంబరు 8న ‘దేవ్ దీపావళి’ పర్వదినాన జన్మించారు. అటుపైన 1947లో తరుణప్రాయంలోనే  సింధు ప్రాంతంలోని తన చిరపరిచిత  ప్రపంచాన్ని వీడి రావాల్సిన దుస్థితిని, వేదనను అనుభవించారు. 

అయినప్పటికీ, చేదు అనుభవాలకు తావు లేకుండా శూన్యం నుంచి తన జీవిత పునరుద్దీపన చేసుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ ఆద్యంతం పునర్నిర్మించగల ఈ లక్షణం, సామర్థ్యం ఆయనలో సహజాతాలు. జనసంఘ్‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేసేవేళ, బీజేపీకి రూపురేఖలు దిద్దే సమయాన ఆయనలోని 
ఈ లక్షణాలే కీలక పాత్ర పోషించాయి. 

అద్వానీ 1989లో పార్టీ అధ్యక్షుడిగా ‘బీజేపీ’కి సారథ్యం వహించినపుడు లోక్‌‌‌‌‌‌‌‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 400 స్థానాల నుంచి 200కన్నా దిగువకు పతనమైంది. ఆ తర్వాత 1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.  అద్వానీ పార్టీలో తరతరాల కార్యకర్తలను తీర్చిదిద్దడంతోపాటు ‘దేశమే ప్రధానం’ సూత్రం ప్రాతిపదికగా పార్టీకి బలమైన పునాదివేశారు. 

ఒక నాయకుడిగా అద్వానీ విశిష్టతను తెలిపే రెండు ప్రత్యేక లక్షణాలను మనమిప్పుడు గుర్తుచేసుకోవాలి.  మొదటిది- ఆయనకుగల సైద్ధాంతిక స్పష్టత- మేధాపరమైన పదును. ఇది ఆయన రచనల్లో, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంటోంది.  ఆయన రూపొందించిన జనసంఘ్,  బీజేపీ  తీర్మానాలు నేటికీ అధ్యయనార్హమే.  ఆయన ఇంటర్వ్యూలు ఎంతో లోతుగా,  సూటిగా ఉండేవి.  రెండోది- భారత రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగిన ‘మిథ్యా లౌకిక వాదాన్ని’ ఎండగట్టడంలో ఆయన చాతుర్యం.  

అద్వానీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను  ఎంతో  శ్రద్ధతో ,  కర్తవ్య నిష్టతో నిర్వర్తించారు.  ఆర్ఎస్ఎస్  ప్రచారక్‌‌‌‌‌‌‌‌గా,  ఆయన  తొలుత రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లోని  వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అక్కడి నుంచి దేశ రాజధానికి వచ్చి  అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయితో కలిసి పనిచేయడం  ప్రారంభించారు. ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే.  అయినా  పరస్పర పోటీదారులుగా మారకపోవడం స్ఫూర్తిదాయకం. 

అదే సమయంలో ఇరువురూ పార్టీ ఉత్థానానికి కృషి చేయడం భారత రాజకీయ చరిత్రలో అత్యంత  అరుదైన అంశం.  అద్భుత నాయక ద్వయానికి సజీవ నిదర్శనమైన అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయి భారత రాజకీయాల  దశ-, దిశలను మార్చివేశారు.

జనసంఘ్‌‌‌‌‌‌‌‌ బలోపేతమే లక్ష్యంగా కృషి

అద్వానీ తన జన్మస్థలం వీడి ఢిల్లీ చేరేనాటికి దేశ విభజన  పర్యవసాన ఘోరాల నుంచి నగరం అప్పుడప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసంఘ్‌‌‌‌‌‌‌‌ బలోపేతం లక్ష్యంగా తనవంతు కృషిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన 1967లో ఢిల్లీ  మెట్రోపాలిటన్  కౌన్సిల్  ఛైర్మన్ అయ్యారు. అక్కడ  విజయ్ కుమార్ మల్హోత్రా (ఆ తర్వాత ఈయన చీఫ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్ అయ్యారు)తో  కలిసి పనిచేశారు. 

అద్వానీ పార్లమెంటరీ ప్రస్థానం 1970లో ప్రారంభమైంది. ఆయన చేపట్టిన కార్యక్రమాలు రాజకీయ వర్గాలన్నిటి ప్రశంసలూ పొందాయి. ఎంపీగా, ఆ తర్వాత ఉభయ సభలలో  ప్రతిపక్ష నేతగానే కాకుండా అధికార పక్షంలో ఉన్నపుడు కూడా తనదైన ముద్ర వేశారు. పార్లమెంటరీ బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ, దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యేవారు.  

లోక్‌‌‌‌‌‌‌‌సభ 1991 నాటి ఎన్నికలు  నాకింకా స్పష్టంగా గుర్తున్నాయి.  అద్వానీ అప్పట్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. వాటిలో ఒకటి గాంధీనగర్. కాగా,  గుజరాత్‌‌‌‌‌‌‌‌తో  ఆయనకు అప్పటికే అనుబంధం ఉంది. దేశ విభజన తర్వాత ఆయన తండ్రి కచ్‌‌‌‌‌‌‌‌లో  స్థిరపడ్డారు.  అద్వానీ  గుజరాత్ నుంచి రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు.  

కాబట్టి, గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లో పోటీ అంటే- ఒకరకంగా  సొంతగూటికి తిరిగి రావడంలాంటిది.  బీజేపీ సంస్థలో భాగస్వామిని కాబట్టి, ఆయన సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేయడంసహా  ప్రచారంలోనూ సహాయపడే  గౌరవం నాకు దక్కింది. 

అద్వానీ జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు

గాంధీనగర్  ప్రజలు ఆయనను  పలుమార్లు తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపారు. అక్కడి ఓటరుగా అనేకసార్లు ఆయనకు ఓటువేసే గౌరవం నాకు లభించింది. అద్వానీ తన నియోజకవర్గంపై చూపిన శ్రద్ధ, బాధ్యతల నిర్వహణ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. 

 అద్వానీ జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు.  ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ  రక్షణ పోరాటాన్ని ఆయన ముందుండి నడిపించారు. నాటి అనుభవాలను ‘ఎ ప్రిజనర్స్ స్క్రాప్-బుక్’ పేరిట రాసిన పుస్తకంలో  ఆయన అందరితోనూ  పంచుకున్నారు.  అందులోని ‘ఏ టేల్ ఆఫ్ టూ ఎమర్జెన్సీస్’ అనే ఒక భాగం 1975 జూన్‌‌‌‌‌‌‌‌లో  భారత్‌‌‌‌‌‌‌‌లో  సంభవించిన పరిణామాలతో,  1933 నాటి  నాజీ  జర్మనీలో సంఘటనలకు గల అద్భుత సారూప్యాన్ని కళ్లకు కడుతుంది. అద్వానీ చిచ్చరపిడుగు వంటి ప్రతిపక్ష నేత.. అంతేకాదు.. అద్భుత పరిపాలకుడు కూడా.

  జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు అద్వానీ సమాచార-ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.  ఆ శాఖలో  ఆయన పనితీరు అత్యంత ప్రభావశీలమైనదిగా పరిగణనలోకి వచ్చింది. అటుపైన ఉప ప్రధానమంత్రిగా, దేశంలో అత్యధిక కాలం హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన నేతగా దేశ భద్రతా వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు.  

మన భద్రతా దళాల జీవితాలను మెరుగుపరచడంలో  ఆయన కృషిని ఇప్పటికీ  ఎంతో 
ఆప్యాయంగా స్మరించుకుంటారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న నిర్ద్వంద్వ వైఖరి వల్లనే భారత్‌‌‌‌‌‌‌‌ అత్యంత పటిష్ట ఉగ్రవాద నిరోధక చట్టం చేయగలిగింది.

మై కంట్రీ  మై లైఫ్

అద్వానీలో ప్రశంసించదగిన గుణాలెన్నో ఉన్నాయి. ఇందుకు తొలి ఉదాహరణ ఆయన నిరాడంబరత్వం.  నవ నిర్మాణ ఉద్యమం తర్వాత అద్వానీ జునాగఢ్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు.  అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ, సాధారణ కార్యకర్తలా నెల రోజులు  మెలిగారు.  

జన జీవనంలో నిజాయితీ అంటే ఎలాంటిదో ఆయన ఆచరణాత్మకంగా చూపారు. పరిచయస్తులందరూ  ఆయనను పుస్తకాల పురుగుగా అభివర్ణిస్తారు. ఆయనతో సమయం గడిపేవారికి వార్తాపత్రికలను ఎంత జాగ్రత్తగా చదువుతారో బాగా తెలుసు.  సినిమా, నాటకాలకు అభిమానిగానే కాకుండా ఉత్సాహభరిత సినీ విమర్శకుడిగానూ ఆయన ప్రసిద్ధులు. 

‘మై కంట్రీ-మై లైఫ్’ పేరిట  ఆయన రాసిన పుస్తకంలో  అద్వానీలోని  చారిత్రక స్పృహ, దాన్ని పరిరక్షించాలనే తపన ప్రస్ఫుటమవుతాయి. అద్వానీ సదా సింధీ సంస్కృతితో సంబంధాలు నెరపేవారు. లేహ్ సమీపంలోని సింధు దర్శన్‌‌‌‌‌‌‌‌ పూజను ప్రాచుర్యంలోకి తేవడం ఆయన కృషిలో మరొక భాగం.  అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌లతో  కలసి  నేను  స్వయంగా ఆ పూజలో పాల్గొన్నాను. 

అద్వానీ సతీమణి శ్రీమతి కమలా అద్వానీ ప్రస్తావన లేకుండా ఆయన అద్భుత జీవన ప్రస్థానంపై  వివరణ అసంపూర్ణమే!  ఆయన ప్రజా జీవితమంతటా నిరంతర శక్తికి, మద్దతుకు ఆమె మూలస్తంభంగా నిలిచారు.  ఆయన సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా  దేశ ప్రజానీకం 2024లో ఆయనను ‘భారతరత్న’ పురస్కారంతో సత్కరించారు.

 ప్రజాభిమానం చూరగొన్న అద్వానీ తన జీవితంలో వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయన ఆయురారోగ్యాలతో  వర్ధిల్లుతూ.. ఎప్పటిలాగానే మనందరికీ స్ఫూర్తి
ప్రదాతగా నిలవాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. 

సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర

అద్వానీ జీవితంలో  సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర నిస్సందేహంగా ఒక చారిత్రక ఘట్టం.  భారత సమాజ గమనాన్ని ఆ యాత్ర  సన్మార్గంలోకి మళ్లించింది. ఈ యాత్రపై  సమాలోచన దశ నుంచి పూర్తిస్థాయి అమలుదాకా  నాకూ భాగం దక్కడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.  యాత్ర  ప్రారంభమైనప్పుడు నేను కూడా సోమనాథ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం ప్రత్యేక అనుభవాన్నిచ్చింది.  

యాత్ర  ఏదైనా అత్యంత శ్రమతో కూడుకున్నదే.  ఎందుకంటే  నిరంతర పయనం,  ఎక్కువ గంటల పని, శారీరక ఓర్పు, అలసటలోనూ ఏకాగ్రత  వీడని సామర్థ్యం అవసరం. అద్వానీ  వీటన్నిటికీ  ప్రతిరూపం. బిహార్‌‌‌‌‌‌‌‌లో అద్వానీ అరెస్టునాటి బాధాకర జ్ఞాపకాలు కూడా నా మదిలో ఇంకా మెదులుతున్నాయి.  ఆ తర్వాత గుజరాత్‌‌‌‌‌‌‌‌లో చిమన్‌‌‌‌‌‌‌‌భాయ్ పటేల్  ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరణతో మన సిద్ధాంతంతోపాటు రామ మందిరం విషయంలో ఎప్పటికీ  రాజీ ఉండదనే  వైఖరి స్పష్టమైంది. 

మన సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఏదేమైనప్పటికీ  రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రమాణం చేశారు. ఎట్టకేలకు అనేక ఏళ్ల తర్వాత దేశ ప్రజల ఆశీస్సులతో అయోధ్యలో శ్రీరామ ప్రభువుకు దివ్య,, భవ్య మందిరం రూపుదిద్దుకుంది.

- నరేంద్ర మోదీ,భారత ప్రధానమంత్రి-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు