దీపావళి రాత్రి ఆకాశంలో విరిసే ప్రతి వెలుగు వెనుక ఓ పట్టణం వందేండ్ల కథ ఉంది. అదే తమిళనాడులోని శివకాశి. ఒకప్పుడు అగ్గిపెట్టెల తయారీతో మొదలైన ఈ ఊరి ప్రస్థానం, ఇవాళ దేశమంతటికీ బాణసంచా అందించే స్థాయికి చేరింది.
1922లో శివకాశికి చెందిన ఇద్దరు యువకులు పి.అయ్య నాడార్, ఎ.షణ్ముగ నాడార్ కోల్‌కతాకు వెళ్లి అగ్గిపెట్టెల తయారీ నేర్చుకున్నారు. తిరిగొచ్చి 1923లో శివకాశిలో అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రారంభించారు.
ఆ తర్వాత రంగురంగుల అగ్గిపుల్లలు, స్పార్కర్లు, చిన్న బాణసంచా తయారీ వైపు అడుగులు వేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విదేశాల నుంచి బాణసంచా దిగుమతులు ఆగిపోవడంతో దేశీయ తయారీకి మంచి అవకాశం వచ్చింది. ఆ పరిణామాలే శివకాశిని దేశంలో బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా మార్చాయని ఇక్కడి పరిశ్రమ యజమానులు చెబుతారు.
ఎండే వరం
శివకాశికి కలిసొచ్చింది ఇక్కడి వాతావరణం. వర్షాలు తక్కువ, ఏడాదిలో ఎక్కువ రోజులు ఎండే. బాణసంచా తయారీలో ఆరబెట్టే పనికి ఇది సరిగ్గా సరిపోతుంది. తేమ ఎక్కువైతే నాణ్యత దెబ్బతినడమే కాదు, ప్రమాదాల ముప్పూ పెరుగుతుంది. వ్యవసాయానికి పెద్దగా అనుకూలం కాని ప్రాంతం కావడంతో ప్రజలు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పరిశ్రమల వైపు మళ్లారు.
బాణసంచాతో పాటు రసాయనాలు, కాగితం, అట్టపెట్టెలు, లేబుళ్లు, ప్రింటింగ్, ప్యాకేజింగ్ వంటి అనుబంధ పరిశ్రమలూ పుట్టుకొచ్చాయి. పటాకుల బాక్సులపై రంగుల లేబుళ్ల కోసం మొదలైన ప్రింటింగ్ ప్రెస్‌లు, ఇవాళ డైరీలు, క్యాలెండర్ల ముద్రణలోనూ శివకాశిని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపాయి.
దేశానికి 95 శాతం ఇక్కడి నుంచే..
పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం శివకాశిలో 800కు పైగా పటాకుల యూనిట్లు ఉన్నాయి. 2 లక్షల మంది కార్మికులు 10 వేలకు పైగా రకాల పటాకులు తయారు చేస్తున్నారు. దేశంలో తయారయ్యే పటాకుల్లో 95 శాతం వరకు ఇక్కడి నుంచే వస్తున్నాయి. అందుకే శివకాశిని ‘భారతదేశ బాణసంచా రాజధాని’ అంటారు.
చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బాణసంచా తయారీ కేంద్రంగా ఎదిగింది. చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరపువ్వొత్తులు, రాకెట్లు, రంగురంగుల ఫౌంటెన్ల దాకా ఎన్నో రకాలు ఇక్కడ తయారవుతాయి. దీపావళి ప్రధాన సీజన్ అయినా, తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులు ఏడాది పొడవునా సాగుతూనే ఉంటాయి.
వెలుగుల వెనుక విషాదం
పరిశ్రమ ఎంత పెద్దదో, ప్రమాదాల ముప్పూ అంతే పెద్దది. రసాయనాల నిర్వహణలో చిన్న నిర్లక్ష్యం జరిగినా భారీ పేలుళ్లు, అగ్నిప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. కార్మికుల భద్రత, పని పరిస్థితులు ఇప్పటికీ కీలక సమస్యలుగానే ఉన్నాయి. ఒకప్పుడు బాల కార్మికుల సమస్య కూడా ఈ పరిశ్రమను వెంటాడింది. వాయు, శబ్ద కాలుష్యం కూడా చర్చనీయాంశంగా మారింది.
సాధారణ మెలకువలతో ఇద్దరు యువకులు వేసిన చిన్న అడుగు ఇవాళ లక్షల కుటుంబాలకు జీవనాధారమైంది. ఆకాశంలో మెరిసే ప్రతి వెలుగు వెనుక ఓ కార్మికుడి చెమట చుక్క ఉంది. మన ఇంట్లో దీపావళి సంబురాలు మొదలయ్యేలోపే శివకాశిలో వేలాది చేతులు తమ పని పూర్తి చేస్తాయి. దేశమంతా దీపావళి వెలుగులు విరజిమ్మాలంటే, శివకాశి శ్రమ నిరంతరం కొనసాగాల్సిందే.
