- తొమ్మిదిసార్లు సర్వే చేసి డిండికి సోర్సు పాయింట్ తేల్చలే: కవిత
- డిండికి ఏదుల నుంచి నీళ్లిస్తమని కాంగ్రెస్ మోసం
- ఏదులకే నీళ్లు లేనప్పుడు డిండికి మాత్రం నీళ్లెట్లొస్తయ్?
- జీకే లింక్‌తోనే నల్గొండ కష్టాలు తీరుతాయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైన తప్పిదాలు చేసిందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత మండిపడ్డారు. తొమ్మిదేండ్లలో 9 సార్లు సర్వేలు చేసి డిండికి సరైన సోర్స్ పాయింట్‌ను తేల్చలేకపోయిందన్నారు. నాటి ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామిగా ఉన్నందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదన్నారు. శనివారం నల్గొండ జిల్లా డిండి రిజర్వాయర్ ను కవిత పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో మోసం చేస్తున్నారన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పూర్తిగా మొద్దుబారి ‘నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)’గా మారిపోయిందన్నారు. అసలు శ్రీశైలం నుంచి ఏదుల రిజర్వాయర్‌కే 2 టీఎంసీలు రాని దుస్థితి ఉంటే.. అక్కడి నుంచి డిండికి నీళ్లు ఎట్ల తెస్తారని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దాహార్తి తీరాలన్నా, డిండి ప్రాజెక్టు బతకాలన్నా ‘గోదావరి–కృష్ణా’(జీకే) లింక్ ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు.
జిల్లాల మధ్య పంచాయితీ పెడ్తున్నరు
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు తేవడం చేతగాకనే పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజల మధ్య ప్రభుత్వం పంచాయితీ పెడుతున్నదని కవిత మండిపడ్డారు. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం నుంచి ఏదులకే నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. డిజైన్లు మార్చి ఆగం చేశారన్నారు ‘‘శ్రీశైలంలో నీటి డ్రా లెవల్‌ను 800 అడుగుల నుంచి 820 అడుగులకు పెంచారు. ఎల్లూరు పంప్‌హౌస్‌ను ఓపెన్ కట్ నుంచి అండర్‌గ్రౌండ్‌గా మార్చడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్రోచ్ చానల్ వెడల్పు 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు కుదించారు. అక్కడ చేపట్టిన విచక్షణారహిత బ్లాస్టింగుల వల్ల ఇప్పటికే కల్వకుర్తి పంప్‌హౌస్‌లో ఒక పంపు పేలిపోయింది. ఏళ్లు గడుస్తున్నా దాన్ని బాగుచేయలేదు.
ఇప్పుడు మళ్లీ 0.6 టీఎంసీల కోసం ఇంకో పంప్‌హౌస్ తవ్వితే ఉన్న కల్వకుర్తి, పాలమూరు పంప్‌హౌస్‌లు కూలిపోయే ప్రమాదం ఉంది. అసలు సర్వే చేయకుండా, జీవో ఇవ్వకుండా మాటలతోనే ఏదుల నుంచి డిండికి నీళ్లిస్తామని ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ సమస్యకు అసలైన విరుగుడు కాళేశ్వరం అదనపు టీఎంసీ నీళ్లను బస్వాపూర్ మీదుగా డిండికి మళ్లించడమేనని కవిత చెప్పారు. ‘‘బస్వాపూర్ రిజర్వాయర్ పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. ఆ పనులు పూర్తి చేస్తే డిండికి గోదావరి జలాలు తేవడం ఎంతో సులువు. శివన్నగూడెం, కిష్టరాయినిపల్లి పూర్తికాకపోయినా.. మల్లన్నసాగర్ నుంచే నేరుగా నీళ్లు తీసుకోవచ్చు. కొండపోచమ్మ సాగర్ నుంచి షామీర్‌పేట చెరువు మీదుగా శివన్నగూడెంకు, బస్వాపూర్ నుంచి ఉల్పరకు గోదావరి జలాలను తరలించే మార్గాలున్నాయి’’ అని వివరించారు.
