వాషింగ్టన్: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనా యంత్రాంగంలో కీలక మార్పులు చేశారు. వైట్‌హౌస్ కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా తనకు అత్యంత నమ్మకమైన సలహాదారుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్(41)ను నియమించారు. ఇప్పటిదాకా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించిన సూసీ వైల్స్.. ‘ట్రంప్ పొలిటికల్ ఆపరేషన్స్’ విభాగానికి మారనున్నారు.
సోమవారం నుంచే మిల్లర్ కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు. 2024 ఎన్నికల విజయం తర్వాత ట్రంప్ తన కొత్త ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో మొట్టమొదటి అప్పాయింట్మెంట్ సూసీ వైల్స్ కావడం విశేషం. అలాగే వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కూడా వైల్స్ చరిత్ర సృష్టించారు.
ఆమె తన పదవీకాలంలో సరిహద్దుల భద్రత, పన్నుల తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి ఎన్నో కీలక రంగాల్లో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని విజయవంతంగా అమలు చేశారని ట్రంప్ కొనియాడారు. ట్రంప్ తన మొదటి టర్మ్‌లో వైట్‌హౌస్ చీఫ్ పదవిలో నలుగురిని మార్చారు. ప్రస్తుత టర్మ్‌లో సూసీ వైల్స్ వారందరి కంటే ఎక్కువ కాలం పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు.
ముందస్తు ప్రణాళికలో భాగమే
ఎన్నికల్లో ఓటమి కారణంగానే ఈ మార్పు చేశారన్న వదంతులను ట్రంప్ తోసిపుచ్చారు. ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలిపారు. మరోవైపు, కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న స్టీఫెన్ మిల్లర్.. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచి ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. గతంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సలహాదారుగా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించిన ఆయన.. ముఖ్యంగా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం జరగట్లేదు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణించలేమని ట్రంప్ స్పష్టం చేశారు. గత 5 నెలలుగా ఈ ఉద్రిక్తతల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టెహ్రాన్‌తో వ్యవహారంలో వాషింగ్టన్ గణనీయమైన పురోగతి సాధించిందని ట్రంప్ తెలిపారు.
ప్రస్తుతం ఘర్షణలు ప్రారంభం కావడానికి ముందుకంటే మెరుగైన స్థాయిలో చమురును వెలికితీస్తున్నామని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా తాను అడ్డుకోకపోతే, ఇజ్రాయెల్ తో పాటు పశ్చిమాసియా మొత్తం నేడు ఉనికిలో ఉండేది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోయినా అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
