పురాణాల ప్రకారం.. ద్వాపర యుగంలో ప్రాగ్నోషికపురం(అస్సాంలోని గౌహతి) ప్రాంతాన్ని నరకుడు పాలించేవాడు. అతడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ క్రమంలో తల్లి చేతిలో తప్ప మరొకరి వల్ల తనకు మృత్యువు సంభవించకూడదనే వరాన్ని శివుడు నుంచి నరకుడు పొందుతాడు. నరకుడు ఓ రోజు వేటకు వెళ్లతాడు. దీంతో జంతువుపై వదిలిన బాణం గురి తప్పి.. ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగులుతుంది. దీంతో అతడు మరణిస్తాడు.
తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందంటూ నరకుడు తీవ్ర కలత చెందుతాడు. దాంతో ఈ బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం ఏంచేయాలో వివరించాలంటూ గురువును ఆశ్రయిస్తాదు. కృష్ణా తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఈ శివ లింగాన్ని పుష్కరం పాటు అంటే. 12 ఏళ్ల పాటు ఆరాధించడం ద్వారా ఈ దోషం పరిహారమవుతుందని నరకుడికి గురువు వివరిస్తాడు.
అందులో భాగంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోని (ప్రస్తుత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం) నడకుదురులో కొలువు తీరిన శ్రీబాలాత్రిపుర సుందరిదేవి సమేత శ్రీపృథ్వీశ్వరస్వామి వారిని నరకుడు నిత్యం పూజిస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకున్న రాక్షస ప్రవృత్తి కారణంగా.. ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి, హింసించడం ప్రారంభిస్తాడు.
దీంతో మహిళలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతారు. తమను రక్షించాలంటూ శ్రీకృష్ణుడిని వారంతా వేడుకుంటారు. సత్యభామతో కలిసి అక్కడకు వచ్చిన స్వామి 16 వేల మంది మహిళలందరినీ రాక్షసుడు నరకాసురుడి బారినుంచి రక్షిస్తాడు. దీంతో శ్రీకృష్ణుడిపై నరకాసురుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దాంతో శ్రీకృష్ణుడిపై యుద్దానికి సిద్దమవుతాడు.
ఈ యుద్దంలో శ్రీకృష్ణుడు కొద్ది సేపు స్పృహ కోల్పోతాడు. దీంతో అక్కడే ఉన్న సత్యభామ నరకాసురుడిపై కోపగించుకుంటుంది. దీంతో యుద్ద రంగంలోకి దూకి నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ క్రమంలో ఈ ఆలయానికి నరకోత్తరక్షేత్రంగా పేరు పొందింది. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి రోజు నరకుడి పీడ వదిలినందున దానినే నరక చతుర్దశి అని పిలుస్తారు.
అభ్యంగన స్నానం.. హారతులు
నరక చతుర్దశి రోజున తెల్లవారుజామునే లేచి, ఒంటికి నువ్వుల నూనె, నలుగు పిండి రాసుకుని వేడి నీటితో స్నానం చేయడం అత్యంత ముఖ్యమైన సంప్రదాయం. నరకాసురుడిని సంహరించిన తర్వాత కృష్ణుడు, సత్యభామలు తమ ఒంటికి అంటిన రక్తపు మరకలు, అలసటను పోగొట్టుకోవడానికి సుగంధ ద్రవ్యాల నూనెలతో స్నానం చేశారనే పురాణ గాథ ఆధారంగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఆ రోజు అభ్యంగన స్నానం చేసి.. విజయానికి సంకేతంగా హారతులు స్వీకరిస్తారు.
నరకాసురుడి పీడ వదిలిపోయిన ఆనందంలో ప్రజలు చీకటిపై వెలుగు విజయానికి సంకేతంగా ఇళ్ల ముంగిట, గుమ్మాల వద్ద మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. లోకకంఠకుడైన రాక్షసుడి మరణాన్ని వేడుకగా జరపాలని నరకుడు కోరిన వరం ప్రకారం దీపావళి రోజు సాయంత్రం యమ దీపం, ఇతర దీపాలను వెలిగించి, ఇంట్లోని ప్రతికూల శక్తులను (చీకటిని) పారదోలుతారు.
వరంగల్ ఉర్సు గుట్ట నరకాసుర వధ
తెలంగాణలో నరకాసుర వధ సంప్రదాయానికి సజీవ రూపం వరంగల్ లోని ఉర్సు రంగలీల మైదానం (ఉర్సు గుట్ట). ఇక్కడ ప్రతి ఏటా దీపావళి సందర్భంగా 50 అడుగులకు పైగా ఎత్తున్న భారీ నరకాసుర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కమిటీల ఆధ్వర్యంలో వేలాది మంది జనం సమక్షంలో రాత్రి వేళ బాణసంచా కాలుస్తూ, తారాజువ్వల వెలుగుల మధ్య నరకాసుర విగ్రహాన్ని దహనం చేస్తారు. విజయదశమి రోజున ఉత్తర భారతదేశంలో జరిగే రావణ దహనం తరహాలోనే, తెలంగాణ ఓరుగల్లు గడ్డపై ఈ నరకాసుర వధ వేడుకను నిర్వహించడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.
సాంస్కృతిక హీరో నరకుడు
ఉస్మానియా యూనివర్సిటీ వంటి కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో దళిత, బహుజన విద్యార్థి సంఘాలు దీపావళి సమయంలో నరకాసుర వర్ధంతిని లేదా నరకాసుర స్మరణ దినంగా నిర్వహిస్తారు. నరకాసురుడు తమ సాంస్కృతిక హీరో అని, ఆయన చెడ్డవాడు కాదని వారు వాదిస్తారు.
ఈశాన్య భారత రాష్ట్రమైన అసోంలో పూర్వపు ప్రాగ్జ్యోతిషపురం చరిత్రలో నరకాసురుడికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి ప్రాచీన భౌమ రాజవంశానికి ఆయనే మూలపురుషుడిగా భావిస్తారు.
ఎన్నెన్నో పురాణ గాథలు
నరకాసురుడి గురించి 12 ప్రత్యేక కథాంశాలు ప్రచారంలో ఉన్నాయి. భూదేవి కుమారుడిగా జన్మించిన నరకాసురుడు రాక్షసుడిగా మారాడని, ప్రాగ్జ్యోతిషపురం పాలకుడి నుంచి దుర్మార్గుడిగా మారాడని చరిత్రకారులు చెబుతుంటారు. నరకాసుర వధలో సత్యభామ పాత్ర, భూదేవి అవతారంగా ఆమెకు ఉన్న ప్రత్యేకత ఆసక్తికరం. నరకాసురుడి చెర నుంచి 16 వేల మంది మహిళలకు విముక్తి కల్పించిన కథ వెనుక సామాజిక సందేశం ఉంది.
