వెలుగు జిలుగుల దీపాల పండుగంటే ఒక్కరోజు సంబురం కాదు ఐదు రోజుల ఆనందోత్సవం. ధనత్రయోదశితో సంపదకు స్వాగతం పలుకుతూ ఐదో రోజు భాయ్ దూజ్ తో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి పట్టాభిషేకం చేసే వేడుక. తొలి రోజు ధన త్రయోదశి, రెండో రోజు చెడుపై మంచి విజయానికి గుర్తుగా నరక చతుర్దశి, మూడో రోజు లక్ష్మీ పూజతో ప్రతి ఇల్లూ వెలుగుల మయం అవుతుంది.
నాలుగో రోజు తెలంగాణలో కేదారేశ్వర వ్రతాలు జరుపుకుంటారు. ఇదే రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తాడని ప్రతీతి. అందుకే ఈ రోజు ఉత్తరాదిలో గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఐదో రోజు భాయ్ దూజ్తో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి పట్టాభిషేకం చేస్తూ సాగే పండుగే దీపావళి. ఈ ఐదు రోజులకు ఒక్కో ప్రత్యేకత, ఒక్కో ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది.
మొదటి రోజు ధన త్రయోదశి
ఆరోగ్య ప్రదాత ధన్వంతరిని, సంపదకు ప్రతీకగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున కొత్త బంగారం, వెండి లేదా ఇత్తడి పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. క్షీర సాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు.
అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలోని ప్రతికూలతలు తొలిగిపోయి ఇంటిలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది అంటారు.
అంతేకాకుండా ఈరోజు నుంచే దీపావళి పండుగ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని, కుబేరుడిని, గణేశుడిని పూజిస్తుంటారు. దీని వలన సంపదకు లోటు ఉండదు అని చెబుతుంటారు. ధన త్రయోదశి రోజున శఖంలో గంగ నీరు నింపి ఇంటిలో మొత్తం చల్లడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయనే విషయం కూడా ప్రచారంలో ఉంది.
రెండో రోజు నరక చతుర్దశి
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే నరక చతుర్దశి.. పురాణ గాథల ప్రకారం.. నరకాసురుడు అనే రాక్షసుడు అందరినీ తీవ్రంగా హింసించేవాడు. తన దురాగతాలతో స్వర్గంలోనూ, భూమిపై పెను విధ్వంసం సృష్టించేవాడు.
ఆ నరకాసురుడు దేవతలు, ప్రజలు, ఋషులను సైతం అవమానించడమే కాకుండా వారి శక్తులను కూడా దుర్వినియోగం చేసేవాడట. ఇంద్రుడు అతని బాధల నుంచి విముక్తి కోరుతూ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ మొరపెట్టుకుంటాడు.
నరకాసురుడి మరణం స్త్రీ చేతిలోనే అనే శాపం గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్తాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను రథసారథిగా చేసి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరిస్తాడు. ఆ నరకాసురుడిని సంహరించిన రోజు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష చతుర్దశి కాబట్టి ఈ తిథిని నరక చతుర్దశి అంటారు. ఈ విజయానికి ప్రతీకగా నరక చతుర్దశి జరుపుకుంటారు.
మూడో రోజు లక్ష్మీపూజ
ఐదు రోజుల వేడుకల్లో మూడో రోజు ప్రధానమైన దీపావళి పండుగగా చాలాచోట్ల జరుపుకుంటారు. ఈ రోజున ఇళ్లను దీపాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి, కుటుంబ సభ్యులంతా కలిసి లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు.
వినాయకుడు విఘ్నాలను తొలగించి శుభారంభాన్ని కలిగిస్తాడని భక్తుల నమ్మకం. అక్షరానికి, వాక్కుకూ ప్రతీక అయిన సరస్వతితోనే యావత్ ప్రపంచం ముందుకు సాగుతోందనే విశ్వాసంతో సరస్వతీ దేవిని పూజిస్తారు. ఈ రోజున ఇండ్లు, వ్యాపార సంస్థల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి బంధుమిత్రులకు స్పీట్లు పంపిణీ చేస్తారు. కొత్త దుస్తులు ధరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి.
నాలుగో రోజు కేదారేశ్వర వ్రతాలు
నాలుగో రోజున తెలంగాణలో కేదారేశ్వర వ్రతాలు జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధించడమే ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం. ఆది దంపతులైన శివపార్వతులను పూజించే అత్యంత విశేషమైన నోము. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ వ్రత మహత్యం వలనే పార్వతీ దేవి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం (అర్ధనారీశ్వరుడు) పొందిందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాదిన ఇదే రోజున గోవర్ధన పూజగా జరుపుకుంటారు.
శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి భారీ వర్షాల నుంచి గోకుల ప్రజలను, పశువులను రక్షించాడని పురాణ కథనం. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ గోవర్ధన పర్వతానికి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే రోజును బలి పాడ్యమి లేదా కొత్త సంవత్సర ప్రారంభ వేడుకగా కూడా జరుపుకుంటారు.
ఐదో రోజు భగిని హస్త భోజనం
యమ ద్వితీయ లేదా భగిని హస్త భోజనం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ అని, మహారాష్ట్రలో భౌ బీజ్ అని, బెంగాల్లో భాయ్ ఫోంటా అని, నేపాల్లో భాయ్ టీకా అని అంటారు. ఈ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.
మన పురాణాల ప్రకారం యమ ధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. ఇద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. ఈ సంతోషంలో అన్నయ్యను ఒక కోరిక కోరుతుంది సోదరి.
ఈ రోజున అక్కా చెల్లెళ్ల చేతితో అన్నం తిన్న వారిని వదిలిపెట్టు అన్నయ్యా కోరుకున్నదట ఆమె. దీనికి ఎంతో సంతోషించిన యమధర్మరాజు కార్తీకమాస శుక్ల పక్ష విదియనాడు ఏ అన్నయ్య అక్క చెల్లెలింటికి వెళ్ళి అన్నం తింటాడో ఆ అన్నయ్యకి అపమృత్యు దోషం లేకుండా ఉంటుందని అనుగ్రహించాడు.
ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. అలా ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం.
