హైదరాబాద్, వెలుగు: ఏపీ జెడ్‌పీ టీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎన్డీయే కూటమి జోరు కొనసాగింది. శనివారం రాత్రి 11 గంటల సమయా నికి ఫలితాలు వెలువడిన 7,291 (ఎన్నికలు జరిగినవి7,767 ) ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 5,169 స్థానాలను గెలుచుకుంది. జనసేన 667, బీజేపీ 135 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక వైఎస్సార్‌సీపీ 1,140 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇతర పార్టీలు, అభ్యర్థులు 180 స్థానాలను దక్కించుకున్నారు. 2,051 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకుగాను ఇప్పటిదాకా 9,347 ఎంపీటీసీ స్థానాల రిజల్ట్ వచ్చేసింది.
ఇక మొత్తం 659 జెడ్‌పీటీసీ స్థానాల్లో ఇప్పటికే 77 ఏకగ్రీవం కాగా..మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. శనివారం రాత్రి 11 గంటల సమయానికి 580 స్థానాల రిజల్ట్ రాగా..ఎన్డీయే కూటమి 492 స్థానాలను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వైఎస్సార్‌సీపీ 54 జెడ్‌పీటీసీ స్థానాలను దక్కించుకోగా..మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.
