- ‘ఇందిరమ్మ ఇండ్లు యాప్’లో వేలాది ఫొటోలు అప్లోడ్
హైదరాబాద్, వెలుగు: ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శనివారం లబ్ధిదారుల ఇండ్లలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను లబ్ధిదారులే స్వయంగా ఇందిరమ్మ ఇండ్లు యాప్ లో అప్ లోడ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల ముందు దీపాలను వెలిగించి సంబురాలు జరుపుకున్నారు. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి ఫొటోలను అప్ లోడ్ చేశారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు, హౌసింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. లబ్ధిదారులు కుటుంబ సమేతంగా తమ ఇంటి ముందు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ ఫొటోలను వారివారి సోషల్ మీడియా అక్కౌంట్లలోనూ పోస్ట్ చేశారు. శనివారం సాయంత్రం నాటికి ఇందిరమ్మ ఇండ్లు పోర్టల్ లో వేలాదిగా ఫొటోలు అప్ లోడ్ అయ్యాయి.
