న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశంపై డిబేట్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరస్పర విరుద్ధ కామెంట్లు చేస్తున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘సర్’పై పార్లమెంట్లో చర్చ జరపలేమని, అది ఎన్నికల సంఘం పరిధిలోనిదని గతేడాది డిసెంబర్లో అమిత్‌షా చెప్పారని గుర్తుచేశారు.
ఈ ఏడాది నవంబర్ 6న ‘సర్’ పై చర్చకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి సవాల్ విసిరారని రాహుల్ తెలిపారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రధాని నరేంద్ర మోదీని కన్ఫ్యూజ్ చేయొద్దని ఆయన అమిత్ షాకు హితవు పలికారు. ఈమేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో అమిత్ షా పార్లమెంట్లో చేసిన పరస్పర విరుద్ధమైన ప్రకటనలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను రాహుల్ గాంధీ షేర్ చేశారు.
‘అమిత్ షా జీ, మోదీజీని కన్ఫ్యూజ్ చేయకండి. నాతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయనకు నచ్చచెప్పండి. ఏ వేదికపై అయినా, ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధం, భయపడకండి’ అంటూ రాహుల్ పోస్ట్ పెట్టారు. పార్లమెంట్లో ఎస్ఐఆర్ చర్చకు సంబంధించి అమిత్ షా వివిధ సందర్భాల్లో భిన్నమైన వైఖరిని ప్రదర్శించారని ఆ వీడియో ద్వారా ఎత్తిచూపారు. ప్రతిపక్షాలు సవాళ్లను స్వీకరించాలని, చర్చల నుంచి పారిపోవద్దని అంతకుముందు హర్యానాలో జరిగిన ఒక ర్యాలీలో అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
