- ఈసీతో పాటు అన్ని వ్యవస్థలను బీజేపీ గుప్పిట్లో పెట్టుకుంది
న్యూఢిల్లీ: దేశంలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో, అసహనంతో ఉన్నారని, ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. ఎన్నికల సంఘం సహా అన్ని వ్యవస్థలను అధికార పార్టీ గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. ప్రధాన మీడియాను తన వైపు లాక్కున్నదని, ఆర్థికంగా బలపడడమే కాకుండా మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల్లో సమాన అవకాశాలు లభించడం లేదని ఫైరయ్యారు. శనివారం ‘ది హిందూ’తోపాటు పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నదని అన్నారు.
‘సర్’ పై పోరాటం ఆగదు
ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సోనియా ఆరోపించారు. సర్, ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల సంఘంలోనూ ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఒత్తిళ్లు, వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ విలువల కోసం గ్రామస్థాయి నుంచి పోరాడుతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిరుపేద నేపథ్యం నుంచి వచ్చి ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేస్తూ ఎదిగారని సోనియా పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ నిర్లక్ష్యమూ కారణమే
దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ కూడా కొంతవరకు కారణమైందని సోనియా అంగీకరించారు. పలు అంశాల్లో తమ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, చూసీచూడనట్లుగా ఉండే ధోరణి ప్రదర్శించిందని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా’ అసౌకర్యంగా భావించి తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ప్రచురణ నుంచి తప్పుకుందన్నారు. ఇది తన పుస్తకాన్ని సెన్సార్ చేసే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఎమర్జెన్సీలో హక్కుల అణచివేత..
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేశారని, హెబియస్ కార్పస్ హక్కును కూడా నిలిపివేశారని సోనియా గాంధీ అంగీకరించారు. అయితే, ఆ చర్యలన్నీ రాజ్యాంగబద్ధంగానే చేపట్టారని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే అప్పటి పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఆ టైంలో జరిగిన అంశాలకు సంజయ్, ఇతరుల ఒత్తిడి కారణమా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. సంజయ్ ఒక్కరే కారణం కాదని చెప్పారు. ఇందిరా గాంధీపై కొందరు సహచరుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండేదని వివరించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత చూసి కన్నీళ్లు పెట్టుకున్నా!
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలను టీవీలో చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ వెల్లడించారు. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనతో దేశ లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని తనకు అర్థమైందని చెప్పారు.
