- కాళేశ్వరంపై అసెంబ్లీలో తేల్చుకుందాం రండ్రి
- కరువుపై మీరు చేసే దుష్ప్రచారమేంటో చెప్తా
- కేసీఆర్.. నువ్వూ నీ కుటుంబమంతా కలిసి రావాలె
- ఓడించారని ప్రజలపై మీ కుటుంబం కక్షగట్టింది
- అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్ని ఆగం చేయాలని చూస్తోంది
- బావ-బామ్మర్దుల మాటలు విని పంటలేస్తే మన్ను పోసి
- అంబలి కాసుకున్నట్లయితది
- కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏండ్లు పట్టింది.. బుద్ది రావడానికి ఇంకెన్నేండ్లు పడ్తదో
- సీబీఐ విచారణ ఆపేందుకు మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లిన కేసీఆర్ ఫ్యామిలీ
- సంక్రాంతి తర్వాత ‘ప్రజా బలం’ యాత్రతో ఊరూరా పర్యటిస్తా
- కొడంగల్ రైతు మేళాలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టు తామే కట్టామని గొప్పలు చెప్పుకొని, అది కుంగిపోతే మాత్రం బాధ్యత తీసుకోని బీఆర్ఎస్ నేతలను ‘మేడిగడ్డ దగ్గర పాతిపెట్టడమే సరైన శిక్ష’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ హయాంలోనేనని, కుంగింది కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు. కేసీఆర్ కాసుల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కుంగిందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణను అడ్డుకునేందుకు కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లిందని ఆరోపించారు.
కరువుపై, కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారని, దమ్ముంటే అసెంబ్లీకి వస్తే వాస్తవాలేంటో అక్కడే తేల్చుకుందామని సవాల్ విసిరారు. ‘దమ్ముంటే కేసీఆర్ తన కుటుంబంతో కలిసి సభకు రావాలె’ అని సవాలు విసిరారు. తమను ఓడించారని ప్రజలపై కేసీఆర్ కుటుంబం కక్షగట్టిందని, అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను ఆగం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.
డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎల్‌నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు అనుమతివ్వాలని స్పీకర్‌ను కోరుతున్నానని, భూముల అంశంపైనా చర్చకు సిద్ధమని చెప్పారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను సీఎం ప్రారంభించారు. అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి.శ్రీధర్ బాబుతో కలిసి వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో ముఖాముఖిలో మాట్లాడారు.
‘కాళేశ్వర రావు’ ఇప్పుడెందుకు వణుకుతుండు?
‘కాళేశ్వరం కట్టింది వాళ్లే, కుంగిపోయింది కేసీఆర్ హయాంలోనే’ అని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నా లెక్కచేయకుండా, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును కమీషన్ల కోసం రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చి, పేరు, స్థలం మార్చి అంచనాలను రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని ఆరోపించారు. కాళేశ్వరాన్ని పక్కనుండి కట్టించానని గొప్పలు చెప్పుకుని, తన పేరు హరీశ్ రావు కాదు ‘కాళేశ్వర రావు’ అని భజన చేయించుకున్న హరీశ్ రావు, ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తడానికే ఎందుకు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కనీస ఇంజనీరింగ్ జ్ఞానం లేకుండా కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ‘మేడిగడ్డలో 16 టీఎంసీలు నిల్వ ఉంటే తప్ప కన్నెపల్లి పంపులకు నీళ్లందవు. అన్నారం, సుందిళ్ల గేట్లు ఎత్తేసి ఉన్నప్పుడు పంపులు ఆన్ చేస్తే ఆ నీళ్లు ఎల్లంపల్లికి చేరకపోగా తిరిగి మేడిగడ్డకే వచ్చి గుండ్రంగా తిరుగుతాయి’ అని వివరించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంటే అసలు దాన్ని ఎందుకు కట్టారని నిలదీశారు. కాళేశ్వరం నిరుపయోగంగా మారినా, ఈ కరువు కాలంలో తుపాకులగూడెం (సమ్మక్క–సారలమ్మ) దగ్గర గోదావరి నీటిని దేవాదుల ద్వారా ఎత్తిపోసి లక్షల ఎకరాలకు, సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినోతో కరువు వస్తే, అది తెలంగాణలోనే వచ్చినట్లు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
‘పది జన్మలెత్తినా కేటీఆర్‌వే’
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రజల్లో నాకు వస్తున్న ఆదరణ చూసి ఒకాయన గడ్డం పెంచుకున్నడట. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాదు. పది జన్మలెత్తినా నువ్వు కేటీఆర్‌వే అవుతవు తప్ప రేవంత్ రెడ్డివి కాలేవు’ అని అన్నారు. రేవంత్ రెడ్డి కావాలంటే పిడుగులు పడినా కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని, నమ్ముకున్నవాళ్ల కోసం నిలబడే తెగువ ఉండాలన్నారు. ‘ఆయనకు గడ్డం రావడానికే 50 ఏండ్లు పట్టింది. బుద్ధి రావడానికి ఇంకెన్నేండ్లు పడుతుందో’ అని ఎద్దేవా చేశారు. పత్రికల్లో చెత్త రాతలు రాయిస్తూ, వాట్సాప్ గ్రూపుల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ను పంచాయతీల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా ప్రజలు బండకేసి కొట్టారని అన్నారు.
పాలమూరుకు తీరని ద్రోహం
పదేండ్లలో దాదాపు రూ.20 లక్షల కోట్ల బడ్జెట్ చేతికొచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని సీఎం విమర్శించారు. తెలంగాణ వస్తే పాలమూరు బాగుపడుతుందని నమ్మి 2009లో కాంగ్రెస్ సీనియర్ నేత విఠల్ రావును కాదని కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలను గాలికొదిలేశారన్నారు. పదేండ్లలో కొడంగల్‌కు నీళ్లు, నిధులు, ప్రాజెక్టులు ఏమీ ఇవ్వలేదన్నారు. 2014లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయి ప్రతి ఎకరా పచ్చబడేదన్నారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు.
వరి వేస్తే ఉరి అన్నది ఎవరు?
మిర్చికి గిట్టుబాటు ధర అడిగిన ఖమ్మం రైతుల చేతులకు సంకెళ్లు వేయించిన దుర్మార్గం, ఇసుక మాఫియాను ప్రశ్నించిన నేరెళ్ల దళితులను లారీల కింద తొక్కించిన పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని, ఆ తప్పులను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని సీఎం అన్నారు. ‘వరి వేస్తే ఉరి’ అని రైతులను భయపెట్టిన కేసీఆర్, తన ఫామ్‌హౌస్‌లో మాత్రం వందల ఎకరాల్లో వరి పండించి క్వింటాల్‌కు రూ.4 వేల చొప్పున కావేరి సీడ్స్ కంపెనీకి అమ్ముకుని కోట్లు గడించారని ఆరోపించారు. కరోనా వేళ క్రోసిన్, పారాసిటమాల్ వేసుకుంటే చాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, పదేండ్లలో లిక్కర్, భూములు, గనులు, కాంట్రాక్టులను కుటుంబ సభ్యులు పంచుకుని లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని దుయ్యబట్టారు.
ఆరుతడి పంటలే వేయండి
రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మరింత తీవ్రమవుతాయని, జులై వరకు వర్షాలు వచ్చే అవకాశం లేదని, కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటడంతో తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందని సీఎం రైతులను అప్రమత్తం చేశారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ‘బావ–బామ్మర్దుల మాటలు నమ్మి వరి వేస్తే, చివరికి మన్ను పోసి అంబలి కాచుకోవాల్సిన దుస్థితి వస్తది’ అని హెచ్చరించారు. యాసంగిలో నీటి అవసరం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు, కందులు, జొన్నలు, కూరగాయలు మాత్రమే వేయాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత ‘ప్రజా బలం’ పేరుతో తానే స్వయంగా ప్రతి గ్రామానికి వచ్చి రైతులను కలుస్తానని, కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఎకరాకు రూ.20 లక్షల పరిహారం
గతంలో ఎకరాకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్‌కు మనసొప్పలేదని, ఇప్పుడు ప్రాజెక్టులకు భూములు ఇచ్చేవారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రైతుల పొలాల దగ్గరే పడుకుని వారిని ఒప్పించి మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల భూములకు ఈ రికార్డు పరిహారం ఇప్పించారని అభినందించారు. 7 రకాల సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనే క్వింటాల్‌కు రూ.4,500 దాకా ధర పలుకుతోందన్నారు. కొడంగల్–కోస్గి జాండ్ర చేనేత కార్మికుల కోసం టస్సర్ సిల్క్ పరిశ్రమ, టేకల్‌కోడ్ దగ్గర సిమెంట్, పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని, పేపర్ కంటే సన్నని జొన్న రొట్టెలు, భౌగోళిక గుర్తింపు పొందిన తాండూరు కందిపప్పును ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.
‘ప్రొటోకాల్ నన్ను దూరం చేయలే’
సీఎం అయ్యాక భద్రత, ప్రొటోకాల్ ఆంక్షల వల్ల కొడంగల్ ప్రజలు తనను నేరుగా కలవలేకపోతున్నారని, కానీ ప్రొటోకాల్ తనను ప్రజలకు దూరం చేయలేదని సీఎం భావోద్వేగంగా అన్నారు. ఒకప్పుడు బైక్‌లపై, కార్లలో ఊరూరా తిరిగిన రోజులను ఎన్నటికీ మర్చిపోలేనని, టైమ్ దొరికినప్పుడల్లా కొడంగల్‌కు వస్తూనే ఉంటానని చెప్పారు. మూడేండ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. చలికాలంలోనూ ఎండలు కొడుతున్న ఈ టైమ్‌లో రైతు
మేళా జరిగే సమయానికి వాన కురిసి వాతావరణం చల్లబడటం దేవుడిచ్చిన ఆశీర్వాదమని అన్నారు. రాబోయే పదేండ్లలో కొడంగల్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతానని భరోసా ఇచ్చారు.
ఢిల్లీ–నోయిడా తరహాలో కొడంగల్
ఢిల్లీ–నోయిడా, ముంబై–పుణె ఎక్స్‌ప్రెస్ కారిడార్ల తరహాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు 250 అడుగుల వెడల్పుతో 80 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నామని, గంటన్నరలోనే చేరుకునేలా కొడంగల్‌ను దేశానికే ఆదర్శ మోడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. లగచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయన్నారు. ఈ నెల 9న కొడంగల్‌లో రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. గతంలో ఈ ప్రాంతానికి కృష్ణా రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నది బీఆర్ఎస్సేనని, కొడంగల్ అభివృద్ధిని ఓర్వలేకే లగచర్లలో అబద్ధాలు చెప్పి రైతులను భయపెట్టి, అమాయకులను రెచ్చగొట్టి కలెక్టర్, అధికారులపై దాడులు చేయించారని ఆరోపించారు. ఇలాంటి కుట్రలకు భయపడబోమన్నారు. హకీంపేటలో 250 ఎకరాల్లో ఉన్నత విద్యాసంస్థలన్నీ ఒకేచోట ఉండేలా ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని, మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు, సైనిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో కొడంగల్‌లో విద్యా విప్లవం తెస్తున్నామన్నారు. మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
