వెలమల అభ్యున్నతికి అండగా కార్పొరేషన్..పేద కుటుంబాలు, యువతకు అండగా నిలవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

వెలమల అభ్యున్నతికి అండగా కార్పొరేషన్..పేద కుటుంబాలు, యువతకు అండగా నిలవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     పెట్టుబడులతో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి
  •      రాష్ట్ర వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా జువ్వాడి బాధ్యతల స్వీకరణ
  •     కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు హాజరు

హైదరాబాద్/ జూబ్లీహిల్స్, వెలుగు: వెలమ సామాజిక వర్గంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి తెలంగాణ వెలమ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను వేదికగా చేసుకోవాలని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతోపాటు యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ తొలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావుకు విషెస్​ చెప్పారు. అమీర్‌‌‌‌‌‌‌‌పేట మైత్రివనంలోని హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ భవనంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు తదితరులు హాజరయ్యారు.

ప్రజాసేవలో జువ్వాడి కుటుంబం

వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. జువ్వాడి కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవలో ముందుంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు సేవలు, అభివృద్ధి స్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు. తన తండ్రి గడ్డం వెంకటస్వామికి, రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావుకు మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు ప్రోత్సహించారని, ధర్మపురి నియోజకవర్గంలో అండగా నిలిచారని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై ఆయన ఇచ్చిన సూచనలు విలువైనవని తెలిపారు. ఏ ప్రాంతానికి అభివృద్ధి అవసరం? పేదలకు ఎలా మేలు చేయాలి? అనే అంశాలను సమగ్రంగా పరిశీలించి నిధులు కేటాయించాలని రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు సూచించేవారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నానన్నారు. 

పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు

వెలమ సామాజిక వర్గంలో ఆర్థికంగా స్థిరపడిన వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని మంత్రి వివేక్ కోరారు. దీంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అదే సమయంలో ఈ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలు ఉన్నాయని, వారి సంక్షేమం, అభ్యున్నతికి కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత లభిస్తోందన్నారు. 

నర్సింగరావుకు ప్రజలతో మంచి సంబంధాలు, రాజకీయ అంశాలపై అవగాహనతోపాటు అనుకున్న పనిని సాధించాలనే పట్టుదల ఉందని  తెలిపారు. ప్రజలకు అవసరమైన పనుల కోసం అధికారులను సంప్రదించడం, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం ఆయన ప్రత్యేకతగా పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని నర్సింగరావు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారులు, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయమన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.

అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్త: నర్సింగరావు
వెలమ సామాజిక వర్గంలో ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే ఆశయం ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వెలమ రైతులు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తానని, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని పేర్కొన్నారు.