- యూజీసీ 7వ వేతన సవరణ నిధులు రిలీజ్ చేయాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు టీజీసీటీఏ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న యూజీసీ 7వ వేతన సవరణ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం (టీజీసీటీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను టీజీసీటీఏ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి. శ్రీనివాస గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలో కలిసిన నేతలు.. డిగ్రీ లెక్చరర్లకు గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బ్రిజేష్ మాట్లాడుతూ.. కేంద్రం యూజీసీ 7వ పీఆర్సీని 2016 జనవరి 1 నుంచి అమల్లోకి తేగా, రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ 29న ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
సీపీఎస్ పరిధిలోని దాదాపు 900 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, పీడీలకు సంబంధించిన 3.5 ఏండ్ల బకాయిలను సీఎస్ఎస్ , జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు కేవలం కాగితాల్లోనే చూపించారని పేర్కొన్నారు. ఆ నిధులను విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇవ్వకపోవడంతో పైసలు ఖాతాల్లోనే మూలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీల ప్రొఫెసర్లకు ఈ బకాయిలను ఎప్పుడో చెల్లించిన ప్రభుత్వం.. డిగ్రీ లెక్చరర్ల విషయంలో తీవ్ర వివక్ష చూపిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరిగాయని, బోధనకు ఇబ్బంది కలగకుండా అదనంగా 400 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని నేతలు కోరారు.
