- సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 వరకే రికార్డుల మార్పు
- 15 బృందాలతో సిట్ సోదాలు
- టెర్రాసిస్ ఆఫీసులో అడ్మిన్ లాగిన్లపై ఆరా
- నలుగురు ఆపరేటర్లను సంగారెడ్డి కోర్టులో
- హాజరుపరిచిన సీఐడీ సిట్
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ రికార్డుల తారుమారు వెనుక మండల స్థాయి నుంచి హైదరాబాద్ దాకా విస్తరించిన వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేసినట్లు సీఐడీ సిట్ దర్యాప్తులో వెలుగుచూసినట్లు తెలిసింది. మండల కేంద్రాల్లోని ఎంపిక చేసిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు నడిపి, ధరణి దరఖాస్తులను హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ ఆఫీసుకు చేరవేసేవారని అధికారులు గుర్తించారు. తహసీల్దార్లతో పనిలేకుండా ఆ ఆఫీసులోని ముఠా నేరుగా లాగిన్ యాక్సెస్‌ను దుర్వినియోగం చేసి భూ యజమానుల పేర్ల మార్పు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లు చేసినట్లు సమాచారం. అధికారుల నిఘాకు చిక్కకుండా ఇవన్నీ ఆఫీసు వేళలు ముగిశాక సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 గంటల మధ్యే చేసినట్లు డిజిటల్ ఫోరెన్సిక్ లాగ్స్ చెబుతున్నాయి. సీఐడీ డీజీ చారు సిన్హా పర్యవేక్షణలో ఏర్పాటైన 15 ప్రత్యేక బృందాలు శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేశాయి.
మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్‌లో ఉన్న ధరణి డెవలపర్ ‘ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ – టెర్రాసిస్ టెక్నాలజీస్’ ఆఫీసులో సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. పోర్టల్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, మాడ్యూల్ డెవలప్మెంట్, యూజర్ లాగ్స్, డేటాబేస్ పర్యవేక్షణ అధికారాలపై ఆరా తీశాయి. భూ రికార్డులను మార్చగలిగే ‘అడ్మిన్, మాస్టర్ లాగిన్’ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది, ప్రైవేటు వ్యక్తులకు డేటాపై నియంత్రణ ఎలా వచ్చిందనే అంశాలను ఐటీ నిపుణులతో కలిసి విశ్లేషిస్తున్నాయి. 2018లో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీజీటీఎస్) ద్వారా టెర్రాసిస్‌కు కాంట్రాక్టు దక్కిన టెండర్ ప్రక్రియ, అందులో పోటీపడ్డ ఇతర సంస్థల వివరాలనూ సేకరించాయి. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోని పోర్టల్ ఆపరేటర్లు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలోనూ సోదాలు చేసి కీలక డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి. 2020 అక్టోబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య జరిగిన సుమారు 8 లక్షల లావాదేవీల్లో దాదాపు 22 వేలు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలడంతో, అనధికారిక ఐపీ అడ్రస్‌లు, లాగిన్ల ఆధారంగా సిట్ కూపీ లాగుతోంది.
సంగారెడ్డి కోర్టుకు నలుగురు
సీఐడీ అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది ధరణి ఆపరేటర్లలో నలుగురు ప్రధాన నిందితులను సంగారెడ్డికి తరలించి కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూములకు సంబంధించిన కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని, సంబంధం లేని భూములకు అక్రమంగా యాజమాన్య హక్కులు కల్పించినట్లు అధికారులు గుర్తించారు. నిషేధిత జాబితాలో ఉండాల్సిన ప్రభుత్వ భూములను ఆపరేటర్లు, దళారులు కలిసి ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చినట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి.
ఏడు జిల్లాల్లో భారీగా అక్రమాలు
సర్వర్లలో ట్రాఫిక్ తగ్గిన రాత్రి వేళల్లోనే నిషేధిత జాబితాలోని భూములను సాధారణ కేటగిరీలోకి మార్చడం, దొడ్డిదారిన నాలా కన్వర్షన్లు చేయడం వంటివి జరిగాయి. ఇవి రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో భారీగా జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆయా జిల్లాల మీసేవ నిర్వాహకులు, చార్మినార్ ఆఫీసు సిబ్బంది మధ్య వాట్సాప్ చాట్లు, కాల్ డేటా, రాత్రి వేళల్లో నమోదైన అనుమానాస్పద ఐపీ లాగిన్ల వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలకు సిట్ సిద్ధమవుతోంది.
టెర్రాసిస్ చేతికి భూ రికార్డులు ఇలా..
టీజీటీఎస్ ఒప్పందంతో 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం కాగా, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనుబంధ సంస్థ టెర్రాసిస్ టెక్నాలజీస్ దాని సాంకేతిక నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత సంస్థ యాజమాన్యం విదేశీ సంస్థల చేతుల్లోకి మారిందని, కోట్ల మంది భూ యజమానుల ఆధార్, పట్టాదారు సమాచారం ప్రైవేటు వ్యక్తుల పరమైందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తాము టెక్నాలజీ పార్ట్నర్ మాత్రమేనని, డేటా యాక్సెస్ తమకు లేదని 2023 జులైలో టెర్రాసిస్ వివరణ ఇచ్చింది. అయినా రికార్డుల తారుమారు వెనుక డెవలపర్లు, ప్రైవేటు ఆపరేటర్ల పాత్ర ఉందని సిట్ అనుమానిస్తోంది. 2024 అక్టోబర్ వరకు ఈ సంస్థల పర్యవేక్షణలోనే పోర్టల్ నడవగా, ఆ తర్వాత ప్రభుత్వం దాని ఎన్ఐసీకు అప్పగించింది.
