గంటలో రూ.7.09 కోట్లు లూటీ..కీర్తనా ఫిన్‌‌ సర్వ్‌‌పై సైబర్‌‌ దాడి

గంటలో రూ.7.09 కోట్లు లూటీ..కీర్తనా ఫిన్‌‌ సర్వ్‌‌పై సైబర్‌‌ దాడి
  •     టీజీసీఎస్బీకి సంస్థ డైరెక్టర్ ఫిర్యాదు

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్‌‌ నేరగాళ్లు కేవలం గంట వ్యవధిలోనే రూ.7.09 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌‌కు చెందిన నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్షియల్‌‌ కంపెనీ (ఎన్‌‌బీఎఫ్‌‌సీ) కీర్తనా ఫిన్‌‌సర్వ్‌‌ లిమిటెడ్‌‌ బ్యాంకు ఖాతాపై సైబర్‌‌ దాడి చేసి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య 39 అనధికారిక లావాదేవీల ద్వారా లూటీకి పాల్పడ్డారు. సంస్థ డైరెక్టర్ చాగంటి వరప్రసాద్(45) ఫిర్యాదు మేరకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదు ప్రకారం.. నానక్‌‌రామ్‌‌గూడలోని ఫైనాన్షియల్‌‌ డిస్ట్రిక్ట్‌‌ కేంద్రంగా కీర్తనా ఫిన్‌‌సర్వ్‌‌ లిమిటెడ్‌‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ఈ కంపెనీ రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా వద్ద నమోదైన నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్షియల్‌‌ సంస్థ. దీనికి ఐడీఎఫ్‌‌సీ(ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ ఫైనాన్స్ కంపెనీ) ఫస్ట్‌‌ బ్యాంకులో కార్పొరేట్‌‌ బ్యాంకు ఖాతా ఉంది.ఈ నెల 6వ తేదీన కంపెనీ బ్యాంకు ఖాతాలో 39 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సంస్థ గుర్తించింది. వీటి ద్వారా మొత్తం రూ.7.09 కోట్లకు పైగా నగదు గుర్తుతెలియని వ్యక్తులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయింది. ఈ మేరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.