నల్గగొండ, వెలుగు: మునుగోడు నియోజకవర్గంపై వివక్ష చూపకుండా కొడంగల్ మాదిరిగానే తమకూ నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సుమారు రూ.9 వేల కోట్లతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ‘ కొడంగల్‌కు నిధులు ఇవ్వ వద్దనేది నా ఉద్దేశం కాదు.. కానీ మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు? మాకెందుకు నిధులు రావు..? ’ అని ప్రశ్నించారు. వెనుకబడిన నియోజకవర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని పీఆర్ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ బారిన పడి దశాబ్దాలుగా నరకం అనుభవించిన మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న తపన తనకు ఉందని, అందుకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం అయినా, మంత్రులైనా రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ఒకే కంటితో, సమానంగా చూడాలని ఆయన హితవు పలికారు.
