పారిశ్రామిక హబ్‌‌‌‌ గా కొడంగల్..ఇది నా బాధ్యత మాత్రమే కాదు.. జీవిత కల: సీఎం రేవంత్ రెడ్డి

పారిశ్రామిక హబ్‌‌‌‌ గా కొడంగల్..ఇది నా బాధ్యత మాత్రమే కాదు.. జీవిత కల: సీఎం రేవంత్ రెడ్డి
  •     2027 డిసెంబర్ నాటికి శంషాబాద్–కొడంగల్ రేడియల్ రోడ్డు పూర్తి
  •     రేర్‌‌తో పాటు నారి, రైజ్, థ్రైవ్ పార్కులు ప్రారంభం
  •     250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్.. టాటా టెక్నాలజీస్‌‌తో ఏటీసీ సెంటర్లు

హైదరాబాద్, వెలుగు: కొడంగల్‌‌ను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడం తన బాధ్యత మాత్రమే కాదు.. జీవిత కల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌‌తో తన రాజకీయ గుర్తింపు, ఆత్మగౌరవం ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. రేర్ (కొడంగల్ రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) ఇండస్ట్రియల్ హబ్ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం దాదాపు 100 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేర్ హబ్‌‌తో పాటు టెక్స్‌‌టైల్ రంగానికి నారి పార్క్, ఎంఎస్ఎంఈలకు రైజ్, స్టార్టప్‌‌లు, ఆవిష్కరణలకు థ్రైవ్ హబ్‌‌లను వర్చువల్‌‌గా ప్రారంభించారు. ఈ పార్కులతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సమావేశంలో ఏరోస్పేస్, రక్షణ, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్‌‌టైల్, అగ్రో ఇండస్ట్రీస్ రంగాల ప్రతినిధులు పెట్టుబడులపై చర్చించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఎయిర్​పోర్టు నుంచి 70 నిమిషాల్లోనే కొడంగల్‌‌కు

అంతర్జాతీయ పెట్టుబడులకు విమానాశ్రయ కనెక్టివిటీ కీలకమని సీఎం పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొడంగల్ వరకు 250 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న గ్రీన్‌‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఎయిర్‌‌పోర్ట్ నుంచి 70 నిమిషాల్లోనే కొడంగల్ చేరుకోవచ్చన్నారు. భవిష్యత్తులో చందన్‌‌వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు భారీ పారిశ్రామిక కారిడార్‌‌గా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ సరిహద్దులకు సమీపంలో ఉండటం కొడంగల్‌‌కు రవాణా, మార్కెటింగ్ పరంగా అనుకూలమన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నిరంతర విద్యుత్, నీరు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తామని, అనుమతుల విషయంలో అధికారులు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలు సంస్థలు ప్లాంట్ల నిర్మాణం చేపట్టడం, మరిన్ని కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 250 ఎకరాల్లో కొడంగల్ రేర్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన కొత్త కోర్సులను రూపొందించి యువతకు శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.