- ఈ నెల 10 నుంచి ఆలయాలకు ప్రత్యేక బస్సులు
- శబరిమల యాత్ర కోసం అద్దెకు సూపర్ లగ్జరీ బస్సులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 10 నుంచి డిసెంబర్ 8 వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ముఖ్యంగా సోమవారాల్లో శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ‘పుణ్యక్షేత్ర దర్శిని’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది.
కనీసం 40 మంది ఒక బృందంగా ఉంటే.. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి, కాళేశ్వరం, రామప్ప, శ్రీశైలం, ఉమామహేశ్వరం తదితర ఆలయాలకు బస్సులు నడపనుంది. అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర కోసం సూపర్ లగ్జరీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించాలని నిర్ణయించింది. బస్సులు బుక్ చేసే గురుస్వాములు, ఏటీబీ ఏజెంట్లకు ఒక్కో బస్సుకు రోజుకు రూ.300 కమీషన్ అందించనుంది.
గురుస్వామి, ఇద్దరు మణికంఠలు, ఇద్దరు వంటవాళ్లు, ఒక అటెండర్‌కు సీటింగ్ సామర్థ్యానికి అదనంగా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. భక్తులు డివిజనల్ అధికారులను సంప్రదించి బస్సులు బుక్ చేసుకోవాలని, ఇతర వివరాలకు జూబ్లీ బస్ స్టేషన్‌లోని జోనల్ కమ్యూనికేషన్ సెల్‌ను 99592 26160 ఫోన్నంబర్లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
