న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సరఫరా చేస్తున్న ఈ20 పెట్రోల్ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని కేంద్రం వెల్లడించింది. పెట్రోల్‌లో 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్ కలుపుతున్నారంటూ కర్నాటక ప్రభుత్వం చేసిన ప్రకటనపై శనివారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
తమ పరీక్షల్లో 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన 893 నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఇథనాల్ శాతం 19 నుంచి 21 మధ్య ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని పేర్కొంది. కర్నాటకలో పరీక్షించిన 56 శాంపిల్స్లోనూ ఇథనాల్ శాతం 19 నుంచి 20 మధ్య నమోదైందని కేంద్రం వెల్లడించింది.
సగటున 19.30 శాతంగా ఉందని.. ఈ20కు అనుగుణంగా రూపొందించిన వాహనాల్లో మైలేజీ తగ్గుదల సుమారు 1-2 శాతం ఉండవచ్చని, కొన్ని ఇతర వాహనాల్లో 3-6 శాతం వరకు ఉండవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, నాలుగు కోట్ల కార్లు మూడేండ్లకు పైగానే ఈ20 ఇంధనాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
పరీక్షా విధానంపై అభ్యంతరాలు..
కొన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న ఇంధనంలో 26–31 శాతం ఇథనాల్ ఉన్నట్లు కర్నాటక సర్కార్ చేసిన ఆరోపణలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు అభ్యంతరం తెలిపాయి. ఈ20 పెట్రోల్ నాణ్యతకు సంబంధించి బీఐఎస్ నిర్దేశించిన ఐఎస్ 17021 ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పాయి.
2005 నాటి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ సరఫరా, పంపిణీ నియంత్రణ ఉత్తర్వులు, 2024 మార్కెటింగ్ డిసిప్లిన్ మార్గదర్శకాల ప్రకారం నమూనాల సేకరణ, పరీక్షించడం జరగాలని చమురు సంస్థలు వివరించాయి. ఒక్కో నమూనా నుంచి 6 లీటర్లు సేకరించి, వాటిని సంబంధిత డీలర్లు, చమురు సంస్థలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలకు రూల్స్ ప్రకారం పంపించాలి.
