ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) రాష్ట్రంలోని దాదాపు అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టుకునేందుకు హైదరాబాద్ నగరంలో దాదాపు 160 ఎకరాల భూమి ఇచ్చింది.
బహుశా ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు తెలంగాణ ఉద్యమంలో బలమైన పాత్ర పోషించినందుకు కావచ్చు. లేదా వారి ఒత్తిడి వల్ల కావచ్చు. కొన్ని కుల సంఘాలకు కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతంలో కూడా 5 ఎకరాల చొప్పున భూమి ఇచ్చింది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేండ్లలో అంగీకరించిన రూ.10 కోట్లు భవన నిర్మాణాలకు ఇవ్వలేదు. ఆ కట్టడాలు జరగలేదు.
కేవలం రెండు కులసంఘాలు కురుమ, యాదవ భవనాలకు మాత్రమే డబ్బు మంజూరుచేసి భవన నిర్మాణాలకు సహకరించింది. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు. ఈ రెండు కులాలు, గొర్ల కాపర్లు, బర్ల పాలతో జీవనం గడుపుతుంటాయి. కనుక ఐక్యంగా చూసినప్పుడు బీసీల్లో కూడా అవి ఎక్కువ ఓట్లు ఉన్న కులాలు. ఆ తరువాత ఏక కులమైన ముదిరాజులుంటారు. ఈ కులాల లెక్కలు 2024–25 కుల సర్వే కూడా తేల్చి చెప్పింది.
2024 డిసెంబర్‌లో మొట్టమొదట దొడ్డి కొమురయ్య హాస్టల్ భవనం కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు. అయితే ఆ మీటింగ్‌లోనే కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం ఆ భవనంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ నడుపుతామని ప్రకటించడంతో అసలు ఈ భవనాలు దేనికి వాడాలి అనే అంశంపై గందరగోళం ఏర్పడింది.
అప్పుడే వేదిక మీద ఉన్న నాకు అసలు ఈ భూమిని, భవనాలను ఎట్లా వాడుకోవాలి? ఎవరి ఆధ్వర్యంలో నడవాలి? ఆ భూమి ఓనరు ప్రభుత్వమా, కుల సంఘ పెద్ద మనుషులా అనే అంశంపై చాలా పెద్ద అనుమానాలు మొదలయ్యాయి.
దానిపేరు ‘తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్– దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ భవనం, కోకాపేట, రంగారెడ్డి జిల్లా. విచిత్రమేమంటే కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్‌లో ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారా! లేదా! ప్రభుత్వం ఆ స్థలాన్ని, భవనాన్ని ఎవరికి అప్పగించింది? దాన్ని నడపడానికి ఒక జీవో రూపంలో గైడ్‌లైన్స్ రూపొందించారా లేదా అనే క్లారిటీ ఎవరికీలేదు. 14 డిసెంబర్ 2024 నుంచి ఈనాటి వరకు అక్కడ ఒక్క విద్యార్థి, విద్యార్థిని నివసిస్తూ తమ విద్యను అభివృద్ధి చేసుకుంటున్న పరిస్థితి లేదు.
జీవో 14 విడుదల
ముఖ్యమంత్రి హాజరవుతున్న మీటింగ్‌లోనే ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ ఎలా వస్తుంది అని ప్రకటించారు? ఆ తరువాత 31 డిసెంబర్‌నాడు నేను ముఖ్యమంత్రికి లెటర్ రాశాను. మొత్తం ఆత్మ
గౌరవ భవనాలకు ఇచ్చిన భూములను, భవనాలను రక్షించడానికి, ఆయా కులాల విద్య, కళల, ఇతర మేధోపర అభివృద్ధికి మాత్రమే వాడేలా వెంటనే గైడ్‌లైన్స్ రూపొందించాలని. కానీ నాకు ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అంటే ప్రభుత్వం ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
ఈలోపు కురుమ సంఘం నాయకులు ఆ భూమిని నారాయణ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యానికి లీజ్‌కు ఇస్తున్నట్టు భోగట్టా బయటికొచ్చింది. మరి కొద్దిరోజులకే నారాయణ కూతురితో సహా కురుమ సంఘం నాయకులు అక్కడ ప్రయివేటు బిల్డింగ్ కట్టడానికి భూమి పూజ జరిపినట్టు వార్తలొచ్చాయి. ఈ స్థితిలో షఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఈ అంశంపై హైకోర్టులో కేసు వేసింది.
శ్రీకాంత్ చింతల అనే పౌరహక్కుల దృక్పథం లాయర్ వాదిస్తున్న కేసు వల్ల బీసీ కమిషనర్‌కు, మినిస్ట్రీకి కోర్టు నోటీసులు పంపింది. ఈ స్థితిలో రాష్ట్రంలోగాని, దేశంలోగాని ఎన్నడూ లేనివిధంగా ఈ భూమిని, భవనాలను ఏయే కుల అవసరాలకు వాడుకోవాలో చెబుతూ బీసీ కమిషన్ చాలా జాగ్రత్తగా, కులాల అభివృద్ధికి తోడ్పడేవిధంగా జీవో 14 విడుదల చేసింది. కుల సంఘ నాయకులు, ఇతర శక్తులుగాని ఈ భూములను లీజ్‌కు ఇవ్వడంగాని, అమ్మడంగాని, కులాతీత అవసరాలకు వాడుకోవడానికి వీలులేదని జీవో స్పష్టంగా చెప్పింది.
ఈ జోవోను రద్దు చెయ్యాలంట?
వెంటనే బీఆర్‌ఎస్ ఎన్నడూ తమ, తమ కులాలను పట్టించుకోని బీసీ నాయకులను రంగంలోకి దింపి ఈ జీవోను రద్దు చేయాలని ప్రకటనలు ప్రెస్‌మీట్‌లు పెట్టిస్తున్నది. 2014లో ప్రభుత్వం ఏర్పడ్డ కొద్దిరోజులకే ఫలానా కులానికి, ఫలానాచోట, ఎన్ని ఎకరాలు భూమి ఇచ్చారో చెప్పి ఆనాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం గైడ్‌లైన్స్ ఎందుకు తయారు చేయలేదు? అన్ని సంవత్సరాలు భవన నిర్మాణాలకు డబ్బు ఎందుకు సాంక్షన్ చేయలేదు? బీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ నాయకుడే ట్రస్ట్ ఫామ్ చేసి, నా తరువాత నా కొడుకు ఈ ట్రస్ట్ నడుపుతాడని ప్రకటించాడని చెబుతున్నారు. బీసీ కమిషన్ ఆ ట్రస్ట్‌ను వెంటనే రద్దు చేసిందని కూడా వార్తలొచ్చాయి. ఆ నాయకుడి మీద బీఆర్‌ఎస్ ఏం చర్య తీసుకుంది?
బీసీ కుల సంఘ నాయకులు..ఆయా కులాలను ఎంత అభివృద్ధి చేశారు?
ఇటు బీఆర్‌ఎస్‌లోని బీసీ నాయకులుగానీ, కాంగ్రెస్‌లోని బీసీ నాయకులుగానీ ఆయా కులాల విద్యాభివృద్ధికి ఎంత కృషి చేశారు? ప్రభుత్వ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియం పెట్టి, ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడపాలని ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవే. ఒక్కొక్క ఎకరం రూ.150 కోట్లు అమ్మే భూమిని కులాల అవసరాలకిస్తే ఆ భూములని కుల సంఘ నాయకులు లీజుకిచ్చి, అమ్ముకుని ఆస్తులను కుటుంబాలకు వేసుకుంటే ప్రభుత్వంకాక ఎవరు బాధ్యత వహిస్తారు?
12 సంవత్సరాలు ఆ భూములు అలానే ఉన్నాయి. రెండు, మూడు కట్టిన భవనాలకు ప్లాన్ లేదు. కుల లీడర్ల ఇనీషియేటివ్ లేదు. ఈ జీవో రావడంతో కొంత క్లారిటీ వచ్చింది. కానీ మళ్లీ ప్రతిపక్ష దోపిడీ నినాదం మొదలైంది. కుల భవనాల మీద ప్రభుత్వ పెత్తనమేంది? అని. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కుల సంఘ లీడర్లు అమ్ముకుంటే ప్రజలు ఎవరిని అడగాలి?
ఆ భూమి ఒక్క కులానిది కాదు. అది రాష్ట్ర ప్రజలందరిది? దాన్ని ఇచ్చిన అవసరానికి, ఆ కుల అభివృద్ధికి కాకుండా దోపిడీకి గురిచేస్తే బాధ్యులెవ్వరు? కులాల్లో చైతన్యమెంత? కులం సంఘ నిర్మాణాలు ఏ ప్రజాస్వామిక సూత్రాలపై ఆధారపడి ఏర్పడుతున్నాయి? అన్ని కుల సంఘాలకు హైదరాబాద్ కుల వ్యాపారులే పెత్తందార్లు ఎందుకయ్యారు? గ్రామాల నుంచి వచ్చిన బీసీ కుల నాయకులు ఎందుకు రాష్ట్ర కులసంఘ అధ్యక్షులు కావడం లేదు?.
కుల జెన్ జీ మూమెంట్లు అవసరం
ఉత్పత్తి కులాలలో విద్య అభివృద్ధి అయి నాయకులు, మేధావులు రావడానికి ఈ కుల భవనాలను కేంద్రంగా చేసుకోవాల్సిన అవసరముంది. అయితే పాత తరం నాయకులు ఇంగ్లిష్ విద్య అభివృద్ధిగానీ, జాతీయస్థాయి జ్ఞానస్థాయిగానీ లేనివాళ్లు. కులం పేరు చెప్పి బతికే సంస్కృతిలో బతికినోళ్లు. ఇప్పుడున్న సోషల్ మీడియాను ఉపయోగించి అత్యాధునిక చైతన్యంగల బీసీ, ఎస్సీ, ఎస్టీ మేధావులని యువతరం ముఖ్యంగా విద్యార్థి తరం నుంచి తయారు చేయాలి.
కురుమ కులంలో ఏర్పడిన షఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధునిక ఇంగ్లిష్ జ్ఞానంతో కోర్టుల్లో, బయట కొట్లాడి ఉండకపోతే ఈ జీవో వచ్చేది కాదు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ప్రభుత్వాల పనితీరు మారాలన్నా యువత కొత్త రకం సోషల్ మీడియా పోరాటాన్ని గ్రామ గ్రామానికీ, ఇంటింటికీ తీసుకుపోవాలి.
తెలంగాణలో జరిగిన కులగణనను, కులాల కంపోజిట్ బ్యాక్‌వర్డ్ ఇండెక్స్‌ను ఉపయోగించుకుని మొత్తం కులాల యూత్‌ని కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ కమిషన్ ఇచ్చిన జీవోను అన్ని కులాలకు బీసీ సోషల్ వేల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అడాప్ట్ చేసుకుని మొత్తం భూముల్ని, భవనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. బీఆర్‌ఎస్ ఈ కొత్త నాటకాన్ని ఆపాలి. బీసీ నాయకులు బానిసలుగా వ్యవహరించడం కూడా ఆపాలి.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు
