పండగంటే పటాకులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, సుతిలీ బాంబులు ఇంకా మరెన్నో రకాలు.. అయితే వీటిని కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలని సూచిస్తున్నారు.
నిప్పురవ్వలు పైన పడి.. పెను ప్రమాదంగా మారకుండా ఉండేందుకు కాటన్ వస్త్రాలను ధరించాలని సూచిస్తున్నారు. అయితే దీపావళి వేళ పటాకులు కాల్చే వారి కోసం ఫోన్ పే ప్రత్యేకంగా బీమా తీసుకు వచ్చింది. కేవలం 11 రూపాయలు చెల్లిస్తే దీపావళి ఇన్సూరెన్సు ఇస్తామని ప్రకటించింది.
హైదరాబాద్‌లో దీపావళి పండుగ వేళ బాణాసంచా ప్రమాదాల వల్ల జరిగే కంటి గాయాలకు త్వరితగతిన అత్యవసర చికిత్స అందించడానికి ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ కంటి ఆసుపత్రులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు, 24/7 అత్యవసర సేవలు, మొట్టమొదటిసారిగా ప్రత్యేక 108 అంబులెన్స్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
దీపావళి వేళ కంటికి గాయాలైన వారికి ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించి, చూపు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 108 అంబులెన్స్ లలో కంటి గాయాలకు చికిత్స చేసే ప్రత్యేక మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచారు. మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, అగర్వాల్స్ ఐ హాస్పిటల్, ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రుల్లో దీపావళి బాధితుల చికిత్స కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
అత్యవసర సమయాల్లో కంటి వైద్యుల సూచనలు
కంటికి స్వయంగా చికిత్స చేయవద్దు. కంటికి గాయమైనప్పుడు సొంతంగా నూనెలు, టూత్‌పేస్ట్ లేదా ఏవైనా కంటి డ్రాప్స్ వేయకూడదు. కంటిని నలపకండి: కంటిలో బాణాసంచా పొడి లేదా నలక పడితే కంటిని గట్టిగా రుద్దకూడదు.
పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు పెద్దలు ఖచ్చితంగా పర్యవేక్షించాలి, వీలైతే రక్షణ కళ్లద్దాలు ధరించాలి. గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే 108 కి కాల్ చేయడం లేదా పైన పేర్కొన్న అత్యవసర కంటి ఆసుపత్రికి తరలించడం చాలా ముఖ్యం.
