న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజులు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, శ్రేయస్సు, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. గత కొన్నేండ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయం ప్రకారమే ఈసారి కూడా దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులతో కలిసి తాను పండుగను జరుపుకోనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. దీపావళి సందర్భంగా దేశమంతటా వెలిగే దీపాలు చీకటిపై పోరాడే భారత సంకల్పానికి ప్రతీకలని పేర్కొన్నారు. “మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీలాగే నేను కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటాను.
ఏటా దేశ సరిహద్దుల్లోని వీర జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకోవడం నాకు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తాను”అని ఆయన తెలిపారు. అయితే, ఈసారి ఏ మిలిటరీ స్టేషన్ లేదా సరిహద్దు పోస్ట్‌ను సందర్శించనున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అంతకుముందు ‘జన్ సంపర్క్ పోర్టల్’ద్వారా దేశ ప్రధాని ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు.
చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ సాధించే శాశ్వత విజయానికి దీపావళి నిదర్శనమన్నారు. దేశ ప్రజలందరూ కొత్త ఉత్సాహంతో ‘వికసిత్ భారత్’నిర్మాణానికి పునరంకితం కావాలని ఆకాంక్షించారు. 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ ప్రతి దీపావళిని సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు.
