దమ్ముంటే నా మీది నుంచి బుల్డోజర్ నడపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌‌

దమ్ముంటే నా మీది నుంచి బుల్డోజర్ నడపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌‌

కోల్‌‌కతా: ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసంపై జరిగిన దాడి, కాళీ పూజా వేడుకలకు ఎదురవుతున్న అడ్డంకులపై బెంగాల్​మాజీ సీఎం మమతా బెనర్జీ ఫైర్​ అయ్యారు. అభిషేక్ నివాసాన్ని సందర్శించిన అనంతరం ఆమె బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు. మీ దగ్గర ఎన్ని బుల్డోజర్లు ఉన్నాయో చెప్పండి, వాటన్నింటిని తన శరీరంపై, ఛాతిపై నడపాలని సవాల్ విసిరారు. మీలో ఎంత ధైర్యం ఉందో తాను చూస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటల ముందే కాళీఘాట్ రోడ్డులోని తన నివాసంపై బీజేపీ బలగాలు అర్ధరాత్రి దాటాక దాడి చేశాయని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. 

రెండు రోజుల పాటు రెక్కి నిర్వహించిన దుండగులు రాత్రి 2 గంటల సమయంలో దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికైన ఓ పార్లమెంట్ సభ్యుడికే ఈ గతి పడితే, ఇక బెంగాల్‌‌లో సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ఆరు నెలల్లో తనపై ఇది ఏడో హత్యాయత్నమని, అయినప్పటికీ ఎలాంటి పోలీస్ చర్య, జ్యుడీషియల్ జోక్యం లేకపోవడం బాధాకరమని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

కాళీ పూజా వేడుకల భగ్నంపై ఆగ్రహం 

ఇదే సమయంలో కాళీ పూజా వేడుకలను బీజేపీ సర్కార్ అడ్డుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏళ్ల తరబడి జరుగుతున్న పూజలకు అనుమతులు రద్దు చేసి, ప్రధాన రహదారిపై కొత్తగా ఓ పూజకు అనుమతించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. స్థానిక క్లబ్‌‌లు తమ కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డు తగులుతున్నారని, ఆ ప్రాంతంలో అశాంతిని సృష్టించేందుకు బీజేపీ గూండాయిజాన్ని ఆశ్రయిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.