రాహుల్ కంటే ముందే అక్షర్‌?.. గంభీర్ ప్రయోగంలో తప్పేమీ లేదు.. గిల్‌కు గవాస్కర్ మద్దతు!

రాహుల్ కంటే ముందే అక్షర్‌?.. గంభీర్ ప్రయోగంలో తప్పేమీ లేదు.. గిల్‌కు గవాస్కర్ మద్దతు!

Sunil Gavaskar: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ డీఎల్‌ఎస్ (DLS) పద్ధతిలో 4 పరుగుల తేడాతో త్రిల్లింగ్ విక్టరీ సాధించినప్పటికీ.. ఛేదనలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 135 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39 పరుగులకే గిల్, కోహ్లీ, రోహిత్‌ల కీలక వికెట్లు కోల్పోయి 39/3తో తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ కంటే ముందే అక్షర్ పటేల్‌ను 5వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను షాక్ కు గురి చేస్తోంది. అక్షర్ పటేల్ కేవలం 7 పరుగులకే నిష్క్రమించడంతో భారత్ 47/4తో మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 

అక్షర్‌ను ముందుకు పంపడంపై గవాస్కర్ సపోర్ట్:
 
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్‌లు తీసుకున్న ఈ ప్రయోగాత్మక నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వారికి మద్దతుగా నిలిచాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కాంప్లిమెంటరీ షోలో గవాస్కర్ మాట్లాడుతూ.. క్రీజులోకి లెఫ్ట్-హాండ్ బ్యాటర్ వస్తే బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్‌ను మార్చుకోవాల్సి వస్తుంది. అలా మార్చే క్రమంలో రైడ్ హ్యాండ్ బ్యాటర్‌కు కూడా బౌలింగ్ దిశ మారి, పరుగులు చేసే అవకాశాలు లభిస్తాయి. ఆ థాట్ ప్రాసెస్‌లో ఎలాంటి తప్పు లేదన్నాడు. అక్షర్ గనుక రన్స్ చేసి ఉంటే కెప్టెన్సీ ఎంత బాగుందో అని పొగిడేవారు. ఇలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు వర్కవుట్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఈసారి వర్కవుట్ అవ్వలేదు.. పైగా అతని తర్వాత కేఎల్ రాహుల్ లాంటి సాలిడ్ బ్యాటర్ ఉన్నాడనే ధైర్యంతోనే ఈ ప్రయోగం చేశారని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. 

గతంలోనూ అక్షర్ పటేల్ ప్రయోగాలు: 

భారత మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌ను ఒత్తిడి సమయాల్లో పైస్థానంలో పంపడం ఇదే తొలిసారి కాదు.. 

* T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో వికెట్లు పడుతున్న వేళ అక్షర్ పటేల్ విరాట్ కోహ్లీతో కలిసి సాధించిన భాగస్వామ్యమే భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపింది.

* ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ గెలుచుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ అంతటా అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కంటే ముందే 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.

మ్యాచ్ స్వరూపం:

అక్షర్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చెరో 30 పరుగులు చేసి జట్టును సురక్షిత తీరాలకు చేర్చారు. 26 ఓవర్లలో భారత్ 113/7 దగ్గర ఉన్నప్పుడు వర్షం రావడం, డీఎల్‌ఎస్ పార్ స్కోర్ కంటే 4 పరుగులు ముందుండటంతో భారత్‌నే విజయం వరించింది.