వీసీ జానయ్య లైంగికంగా వేధిస్తున్నరు: అగ్రికల్చర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపణ

వీసీ జానయ్య లైంగికంగా వేధిస్తున్నరు: అగ్రికల్చర్ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపణ

పంజాగుట్ట, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్​జానయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపించారు. హైదరాబాద్​లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్​లో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 1న తాను పీహెచ్​డీ డిప్యుటేషన్ పొడిగింపు అనుమతి కోసం వీసీ వద్దకు వెళ్తే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేశారన్నారు. 

అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేస్తూ, వ్యక్తిగతంగా తనను కలవాలని, భర్తను వదిలి తనతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలని కోరారు. 

ఆమెవి అసత్య ఆరోపణలు..

అసిస్టెంట్ ప్రొఫెసర్​తేజశ్రీని బదిలీ చేసినందునే కక్షగట్టి వీసీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ టీచింగ్, నాన్​ టీచింగ్ సంఘాల నాయకులు అన్నారు. సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ప్రొఫెసర్లు భార్గవి, హేమలత, మాధవీలత, శంకర్​లు మీడియాతో మాట్లాడారు.

వీసీ యూనివర్సిటీలో ఉద్యోగులు, విద్యార్థుల సంక్షేమం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చారని, ఇందులో భాగంగా దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ట్రాన్స్​ఫర్​చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తప్పుడు ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.