పండుగ ఖర్చుల తీరు మారింది.. బంగారంపై తక్కువ.. ఎలక్ట్రానిక్స్పై ఎక్కువ

పండుగ ఖర్చుల తీరు మారింది.. బంగారంపై తక్కువ.. ఎలక్ట్రానిక్స్పై ఎక్కువ

న్యూఢిల్లీ: ఈసారి దీపావళి, ధన్​తేరాస్​సందర్భంగా కస్టమర్ల షాపింగ్​పద్ధతులు మారాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో నగల కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారీ ఆభరణాలకు బదులు తేలికపాటి ఆభరణాలు, చిన్న బంగారు నాణేలు, తక్కువ బరువు నగలపై ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లలో సౌకర్యాలు పెంచుకునేందుకు గృహోపకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద ఫ్రిజ్​లు,  వాషింగ్ మెషీన్లు, టీవీలను భారీగా కొంటున్నారు. దీంతో బంగారంతో పాటు గృహోపకరణాల మార్కెట్‌‌‌‌‌‌‌లోనూ సందడి నెలకొంది. 

అధిక ధరల వల్ల కొనుగోలుదారులు తమ ఖర్చులను అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ఈ ఏడాది ప్రత్యేకత. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ధన్​తేరాస్​ బంగారం విక్రయాల విలువ 15–20 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. అధిక ధరల వల్ల.. విక్రయించిన బంగారం పరిమాణంలో మాత్రం అదే స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని అంచనా. 

గతంలో పండుగల సందర్భంగా భారీగా పుత్తడి కొన్నవాళ్లు ఇప్పుడు తమ బడ్జెట్‌‌‌‌కు అనుగుణంగా చిన్న కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా 18 క్యారెట్ల నగలు, తక్కువ బరువు ఉన్న ఆభరణాలు, చిన్న బంగారు నాణేలకు ఆదరణ పెరిగింది. పెట్టుబడి కోణంలో బంగారం కొనాలనుకునే వారు కూడా భారీగా కాకుండా విడతలవారీగా కొంటున్నారు.

అప్లయన్సెస్​ కంపెనీలకు ముందే పండగ

ఖరీదైన ఎలక్ట్రానిక్స్​, గృహోపకరణాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. హాయర్ విక్రయాలు పరిమాణం పరంగా 10–12 శాతం, విలువ పరంగా 25–30 శాతం పెరిగాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు, పెద్ద తెర టీవీలకు మంచి గిరాకీ ఉంటోంది.  లేటెస్ట్​ ఫీచర్లు ఉన్న మోడళ్లపై ఆసక్తి పెరిగింది. పట్టణాల్లోనూ వీటి కొనుగోళ్లు బాగున్నాయి. 

గోద్రెజ్ అప్లయెన్సెస్ విక్రయాల విలువ గత ఏడాది పండుగ సీజన్‌‌‌‌తో పోలిస్తే 50 శాతానికి పైగా పెరిగింది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మంచి అమ్మకాలు సాధించాయి. పండుగ ఆఫర్లు, ఈఎంఐలు, బ్యాంకుల కార్డు డిస్కౌంట్లు కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. పాత వాటికి బదులు కొత్త మోడళ్లను (ఎక్స్చేంజ్​) కొనే వాళ్లూ పెరిగారు. అమ్మకాలు​పెరిగినంత మాత్రాన కంపెనీల లాభాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పలేం.

ముడిసరుకు ధరలు, రవాణా వ్యయాలు, మార్కెటింగ్ ఖర్చులు లాభాలపై ప్రభావం చూపుతున్నాయి.  అధిక ధరల కారణంగా బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశమూ ఉంది. అయినప్పటికీ జనం ఖర్చులకు వెనుకాడకపోవడం మార్కెట్​కు సానుకూలమే. పండుగల తర్వాత కూడా ఇదే స్థాయిలో కొనుగోళ్ల జోరు కొనసాగుతుందా..? అన్నది  కంపెనీలకు కీలకం.