హైదరాబాద్: మహిళల ఉచిత బస్సు స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (నవంబర్ 8) వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో మెగా రైతు మేళా సమావేశ హాలులో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు పథకం పెడితే బీఆర్ఎస్ దుర్మార్గులు ఓర్వలేకపోయారని.. ఆటో డ్రైవర్లతో కలిసి ఆ పథకాన్ని రద్దు చేయించేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
ఆటో వాళ్లతో కలిసి నాపై యుద్ధానికి వచ్చారని.. ఆడబిడ్డలతో పెట్టుకుంటే బుద్ధి చెప్తారని హెచ్చరించడంతో భయపడి వెనక్కి తగ్గారని అన్నారు. ఆటో డ్రైవర్లను ఇంకో విధంగా ఆదుకుంటాం తప్పితే.. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీమ్ రద్దు చేయాలనే వారిని చీపుర్లతో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా శక్తే మా ప్రభుత్వ శక్తి అని స్పష్టం చేశారు.
ఆడబిడ్డలు నిండు మనసుతో తనను ఆశీర్వదించారని.. మహిళలు అండగా నిలిచారు కాబట్టే చిన్న వయస్సులోనే సీఎం అయ్యానని తెలిపారు. నాకు ఇంకా కోరికలు కానీ ఆశించే పదవులు కానీ ఏవీ లేవని.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే నా జన్మ ధన్యం అయినట్టేనని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.
ఆడబిడ్డలకు భరోసా ఉండాలనే ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళ పేరిటే ఇచ్చామని చెప్పారు. మహిళలపై ఆర్థికభారం తగ్గించాలని ఉచితంగా సన్నబియ్యం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఐదేళ్లు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ఆస్తి కోసం కేటీఆర్ సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేశారన్నారు.
చెల్లె ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునే వాడే అన్నా.. కానీ కేటీఆర్ మాత్రం జైలు నుంచి ఇంటికి వచ్చిన చెల్లెను బయటకు గెంటేశాడని విమర్శించారు. కేటీఆర్‌ను సొంత చెల్లె కూడా నమ్మడం లేదన్నారు. కుటుంబ సమస్యను చక్కదిద్దుకోలేని వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలాగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు వాళ్లు ఏం చేశారో.. మూడేళ్లలో మేం ఏం చేశామో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
