న్యూఢిల్లీ: 2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఓటమి ఖాయమని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రభుత్వ మార్పుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల గురించి మాట్లాడుతూ.. ఎన్నికల ద్వారా మాత్రమే ప్రభుత్వ మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థ కావాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
సర్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను కాపాడటానికి ఎన్డీఏ ప్రభుత్వం దేశ యువతపై యుద్ధం చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానేష్ కుమార్ ఎందుకంత ముఖ్యమని ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగరేసినందుకు తనను, తన స్నేహితులను జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుంటే జైల్లో పెట్టడం చివరగా బ్రిటీష్ పాలనలో.. మళ్లీ ఇప్పుడు బీజేపీ పాలనలో జరిగిందన్నారు.
బ్రిటిషర్ల మాదిరిగానే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛను హరిస్తోందని విమర్శించారు. ఎన్నిసార్లు జైల్లో పెట్టిన తాను జాతీయ జెండా ఎగరేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. దేశంలో ప్రజలు ఏమి తింటున్నారు.. ఎవరిని వివాహం చేసుకుంటున్నారు.. ఎవరికి ఓటు వేస్తున్నారు అనే విషయాలను కేంద్రం క్రమంగా నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకుంటున్నారని అన్నారు.
గత 10, 12 ఏళ్లుగా దేశం చాలా వరకు నిశ్శబ్దంగానే ఉండిపోయిందని.. బీజేపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఎవరూ పెద్దగా నోరు విప్పలేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ నిరసన ప్రజల్లో మళ్లీ చైతన్యం తీసుకొచ్చి.. ప్రభుత్వ వైఫల్యాలపై గొంత్తెత్తేలా ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందన్నారు. ప్రశ్నించడం ప్రారంభించినందుకే యువ నిరసనకారులపై బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.
బీజేపీ మత ప్రాతిపదికన ప్రజలను విభజిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసమే అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఫర్ఫెక్ట్గా ఉన్నాయని తాను అనడం లేదు. కానీ భారతదేశం అప్పుడు మరింత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. గత ప్రభుత్వాలలో ప్రధానమంత్రిని విమర్శించేందుకు అనుమతి ఉండేది. ప్రజాస్వామ్యం అలానే ఉండాలి. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రధాని విమర్శిస్తే జైల్లో పెడుతున్నారని అన్నారు.
