పోలాండ్‌లోని క్రాకోవ్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ఆ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బహిరంగ ప్రదేశంలో నిందితుడు ఆరుగురిని కాల్చి చంపేశాడు. నిందితుడి ఇంట్లో మరో ముగ్గురు విగతజీవులుగా కనిపించడంతో పోలాండ్లో ఈ ఘటన సంచలనంగా మారింది. క్రాకోవ్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని ఒస్ట్రోవియెక్ ష్వియెంటోక్రిస్కీ (Ostrowiec Świętokrzyski) పట్టణంలో నిందితుడి ఇల్లు ఉంది.
SHOTS fired in Polish city of Krakow — citizens COWERING behind buildings Authorities already ON SITE https://t.co/WONgjTOiGR
— RT (@RT_com) November 7, 2026
అక్కడ పోలీసులు తనిఖీలు చేయగా.. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ వెల్లడించారు. మృతులు నిందితుడి కుటుంబానికి చెందిన బంధువులై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లో కలిపి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
పోలాండ్‌లోని రెండో అతిపెద్ద నగరమైన క్రాకోవ్‌లో శనివారం (నవంబర్ 7) మధ్యాహ్నం ఈ దారుణం వెలుగుచూసింది. నగరంలోని చారిత్రక మెయిన్ మార్కెట్ స్క్వేర్ పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఓ వ్యక్తి కారులో అక్కడికి చేరుకుని, తన దగ్గర ఉన్న తుపాకీతో ప్రజలపై కాల్పులు జరిపాడు.
ఉన్నట్టుండి తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కొందరు సమీపంలోని దుకాణాలు, రెస్టారెంట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. మరికొందరు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. ఈ దాడిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కలిపి మొత్తం ఆరుగురు మరణించారు. మృతుల్లో ఒకరు బ్రిటన్‌కు చెందిన పౌరుడిగా గుర్తించారు.
