జెరూసలేం: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆర్మీ చీఫ్, యషార్ పార్టీ ఛైర్మన్ గాడి ఐసెన్కోట్ను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆరు వారాల్లోగా బలం నిరూపించుకోవాలని సూచించారు. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లోని 120 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నెతన్యాహు నేతృత్వంలోని కూటమి 53 సీట్లు కైవసం చేసుకుంది. ఐసెన్కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 సీట్లు దక్కాయి. అరబ్ పార్టీలు 19 స్థానాలు గెలుచుకున్నాయి.
120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 స్థానాలు అవసరం. నెతన్యాహు కూటమికి కానీ, అటు ప్రతిపక్ష ఐసెన్ కోట్ కూటమికి కానీ మెజారిటీ దక్కలేదు. మ్యాజిక్ ఫిగర్ ఏ కూటమికి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో అరబ్ పార్టీల కూటమి మద్దతు కీలకంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు ఇరు పక్షాలు ప్రయత్నాలు చేశాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు అరబ్ పార్టీల మద్దతు తప్పనిసరిగా మారగా.. వాటి సపోర్ట్ తీసుకునే ప్రశ్నే లేదంటూ నెతన్యాహు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే అరబ్ పార్టీల కూటమి గాడి ఐసన్ కోట్ వైపు నిలిచింది. నెతన్యాహు అనుసరిస్తున్న కఠిన విధానాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ఆయనను అధికారంలో నుంచి గద్దె దించడమే లక్ష్యంగా ఐసెన్ కోట్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై అధ్యక్షుడు పార్టీలతో చర్చలు జరిపారు. అధ్యక్షుడు జరిపిన సంప్రదింపుల్లో 19 స్థానాలు గెలుచుకున్న అరబ్ పార్టీ కూటమి ప్రతిపక్ష నేత ఐసెన్కోట్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నెతన్యాహుకు కేవలం 46 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. అరబ్ పార్టీల మద్దతుతో ఐసెన్కోట్ కూటమి బలం 67కు చేరుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది.
ఈ నేపథ్యంలో ఐసెన్కోట్ను ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు ఆహ్వానించారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, మిత్రపక్షాలతో చర్చలు జరపడానికి, సంకీర్ణ ఒప్పందాలను ఖరారు చేయడానికి, పార్లమెంటరీ ఆమోదం పొందడానికి ఐసెన్కోట్కు ఆరు వారాల వరకు సమయం ఉంటుంది.
ఒకవేళ నిర్ణీత గడువులోగా ఐసెన్కోట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైతే, అధ్యక్షుడు ఈ అవకాశాన్ని నెతన్యాహుకు లేదా మూడవ అభ్యర్థికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోతే దేశం మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే సుదీర్ఘకాలంగా దేశ రాజకీయాలను శాసించిన నెతన్యాహు అధికారం కోల్పోయే ముంగిట నిలిచారు.
