వరుస తుఫాన్లతో రైతన్నకు దెబ్బ...ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 వేల ఎకరాల్లో పంట నష్టం..

వరుస తుఫాన్లతో రైతన్నకు దెబ్బ...ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 వేల ఎకరాల్లో పంట నష్టం..
  • ప్రభుత్వం ఆదుకోవాలంటున్న బాధిత రైతులు

ఖమ్మం, వెలుగు: వరుస తుఫాన్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఖమ్మం జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

చేతికొచ్చే సమయంలో... 

ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన తుఫాన్లు అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లాయి. పెట్టుబడుల కోసం అప్పులు చేసి, పంట దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరి, పత్తి, మిర్చి తదితర పంటలు పూర్తిగా పాడవ్వడంతో రైతులు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో పంట నష్టం ఎక్కువగా జరిగింది. 

ఖమ్మం జిల్లాలో 12 వేల మంది రైతులు 23 వేల ఎకరాల పంట నష్టపోయారు. పూర్తి స్థాయిలో నివేదిక మరో మూడు, నాలుగు రోజుల్లో వస్తుందని అధికారులు చెబుతున్నారు. రైతులు మాత్రం పంట నష్టంపై అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఎకరాను పరిశీలించి, పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


పంటకు భారీ నష్టం జరిగింది..

తుఫాన్ కారణంగా వెంకమ్మ చెరువు కట్ట తెగి పంటకు భారీ నష్టం జరిగింది. చేనులో పెద్ద వర్రెలు ఏర్పడ్డాయి. తోటలో ఇసుక మేటలు వేసింది. ఐదు ఎకరాల్లో కోకో,  10 ఎకరాలలో పామాయిల్,  5 ఎకరాల్లో కొబ్బరి తోట కోలుకోలేని దెబ్బ తిన్నాయి.  నాలాంటి పరిస్థితే చాలా మంది రైతులకు ఉంది. అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. 
-తాడేపల్లి రవి, అశ్వారావుపేట

చేతికొచ్చిన పంట వరద పాలు

ఆరు ఎకరాల్లో వరి పంట రూ.2 లక్షల ఖర్చు చేసి సాగు చేశా. మరో వారం రోజుల్లో కోతకు సిద్ధం అవుతుండగా తుఫాన్ వరదతో పంట అంతా నేలపాలై తీవ్రంగా నష్టపోయా. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి.
- తోకల గోపయ్య, రైతు, జగన్నాధపురం