హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ కేసులో అప్పటి మియాపూర్ ఎస్‌హెచ్‌ఓ ఎం.ప్రేమ్‌కుమార్‌కు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలును హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రంగారెడ్డి జిల్లా హఫీజ్‌పేట పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో వివాదాస్పద భూమికి సంబంధించి 2019లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ ఎ.శేఖర్‌బాబు మరికొందరు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారంటూ ప్రేమ్‌కుమార్‌కు నాలుగు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రేమ్‌కుమార్ ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేశారు.
జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం ఈ అప్పీలును విచారించింది. 2019 నాటి ఉత్తర్వుల విషయం ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన ప్రేమ్‌కుమార్‌కు తెలియదని, ఆ విషయం తెలిసిన వెంటనే సదరు భూమికి రక్షణ కల్పించామని అప్పీలుదారు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తులు సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేశారు.
