- విద్యార్థులు, తల్లిదండ్రులకు NMC అడ్వైజరీ
- యూపీఫేక్ కాలేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాలు
- కాలేజీ గుర్తింపు, విద్యా సంవత్సరపు సీట్ల కోటా చూశాకే ఫీజులు కట్టాలి
- ఏజెంట్లను నమ్మి వ్యక్తిగత ఖాతాల్లో నగదు వేయొద్దని కమిషన్ స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులు, తల్లిదండ్రులు నకిలీ మెడికల్ కాలేజీల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అడ్వైజరీని జారీ చేసింది.
ప్రవేశం పొందే ముందు లేదా ఫీజులు చెల్లించే ముందు సదరు కాలేజీలకు ఎన్ఎంసీ చట్టబద్ధమైన గుర్తింపు, ప్రస్తుత విద్యా సంవత్సరానికి తగిన అనుమతులు ఉన్నాయో లేదో అధికారిక వెబ్ సైట్ ద్వారా సరిచూసుకోవాలని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (యూజీఎంఈబీ)స్పష్టం చేసింది.
గతంలో కాలేజీ నడిచినంత మాత్రాన లేదా లిస్టులో పేరున్నంత మాత్రాన ఆ ఏడాది అడ్మిషన్లకు అనుమతి ఉన్నట్లు కాదని, మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) రికార్డుల ప్రకారం కేటాయించిన సీట్ల సంఖ్యను కూడా చెక్ చేసుకోవాలని సూచించింది.
ఎంబీబీఎస్ ప్రవేశాలు కేవలం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) లేదా రాష్ట్రాల అధికారిక కౌన్సెలింగ్ ద్వారానే జరుగుతాయని, ఏజెంట్లకు గానీ, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు గానీ డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించింది. నకిలీ కాలేజీలు లేదా ఫోర్జరీ లెటర్లపై కమిషన్‌తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం..
ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై విచారణ జరుపుతున్న ‘ఆయేషా జైన్ వర్సెస్ అమిటీ యూనివర్సిటీ’ కేసు సందర్భంగా యూపీ ఫామ్‌హౌస్ లో నడిపిస్తున్న ఫేక్ మెడికల్ కాలేజీ ఉదంతం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నకిలీ సంస్థల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)తో పాటు ఎన్ఎంసీ సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. కాలేజీల వాస్తవికత, గుర్తింపును స్వయంగా సరిచూసుకోకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అడ్మిషన్లు తీసుకోవద్దని దేశవ్యాప్తంగా పబ్లిక్ అడ్వైజరీలు ఇవ్వాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకే నేషనల్ మెడికల్ కమిషన్ ఈ హెచ్చరికలను జారీ చేసింది.
యూపీలో ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని ఏటా జిల్లా మహమూద్‌పూర్ నగరియా గ్రామంలో వెలుగుచూసిన నకిలీ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇటీవలే కలకలం రేపింది. పంట పొలాల మధ్య శిథిలావస్థలో ఉన్న రెండు మూడు గదుల ఓ పాత ఫామ్ హౌస్ నుంచే కేటుగాళ్లు బీఎస్ మెడికల్ కాలేజ్ పేరిట నకిలీ విద్యాసంస్థను నడిపించారు. ఎలాంటి ల్యాబ్‌లు, హాస్పిటల్ సౌకర్యాలు, చట్టబద్ధమైన అనుమతులు లేకపోయినా.. ఎంబీబీఎస్, డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సుల్లో కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామంటూ ప్రచారం చేశారు.
పోలీసుల విచారణలో నిరక్షరాస్యుడైన ఓ స్థానిక చాయ్‌వాలా భగవాన్ దాస్ సింగ్ బఘేల్‌ను ఈ సంస్థకు చైర్మన్‌గా చూపించినట్లు తేలింది. ఈ దందాపై వెలువడిన కథనాలు, బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు సతేంద్ర కుమార్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకే సుప్రీంకోర్టు ప్రస్తావిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని విద్యా నియంత్రణ సంస్థలను ఆదేశించింది.
