వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి: హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యాంకోశీ

వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి: హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యాంకోశీ
  • ఇరువర్గాల అంగీకారంతోనే సమస్యకు పరిష్కారం
  • హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యాంకోశీ

హైదరాబాద్, వెలుగు: వినియోగదారుల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే విధానాన్ని అందరూ ప్రోత్సహించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాంకోశీ అన్నారు. వినియోగదారుల పరిరక్షణ చట్టంలో దీనికి గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రజల్లో తగిన అవగాహన కొరవడటంతో పాటు న్యాయవాదులు, కక్షిదారులు దీన్ని కేవలం అదనపు ప్రక్రియగా మాత్రమే భావిస్తున్నారని చెప్పారు. ఆ అపోహ తొలగిపోవాలని తెలిపారు.

శనివారం ఆయన హైదరాబాద్‌‌‌‌లోని ఏరువాక భవన్‌‌‌‌లో రాష్ట్ర వినియోగదారుల కమిషన్, బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. పెద్ద సంస్థలు, సాధారణ వ్యక్తుల మధ్య ఉండే ఆర్థిక, సామాజిక అంతరాలను గమనిస్తూ, బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతినకుండా మధ్యవర్తిత్వం సాగాలని జస్టిస్ పి. శ్యాంకోశీ స్పష్టం చేశారు. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు మధ్యవర్తులకు చట్ట పరిజ్ఞానంతో పాటు సహనం, నిష్పక్షపాత వైఖరి, మానవీయ దృక్పథం అవసరమని పేర్కొన్నారు.

అలాగే బీమా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకూ ఈ సేవలను సులభంగా అందించేందుకు ఆన్‌‌‌‌లైన్ మధ్యవర్తిత్వాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని జస్టిస్ పి. శ్యాంకోశీ పిలుపునిచ్చారు. జస్టిస్ మౌసమీ భట్టాచార్య మాట్లాడుతూ..వినియోగదారుల వివాదాలు తక్కువ టైంలో పరిష్కరమవ్వాలంటే మధ్యవర్తిత్వ విధానాన్ని వినియోగించాలని చెప్పారు.

నోటీసులు, వాయిదాల ప్రమేయం లేకుండా 120 రోజుల్లోనే (అవసరమైతే మరో 60 రోజులు పొడిగించి) ఈ విధానంలో కేసులు పరిష్కారమవుతాయని వివరించారు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు జస్టిస్ జి. రాధారాణి మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు, సేవల్లో లోపాలు, బీమా క్లెయిమ్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల వివాదాలకు మధ్యవర్తిత్వం సమర్థవంతమైన పరిష్కార మార్గమని పేర్కొన్నారు.