- ఊపిరాడకుండా చంపి సహజ మరణాలుగా నమ్మించే కుట్ర
- కరీంనగర్జిల్లా వచ్చనూర్ లో ముఠా దారుణం
- స్థానిక యువకులే నిందితులు.. నలుగురి అరెస్ట్, ఒకరు పరారీ
కరీంనగర్, వెలుగు: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం వచ్చనూర్ గ్రామంలో దారుణం వెలుగు చూసింది. ముగ్గురు స్థానిక యువకులు ముఠాగా ఏర్పడి ఒంటరిగా నివసిస్తున్న ఇద్దరు వృద్దురాళ్లను హత్య చేశారు. వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగలను లక్ష్యంగా చేసుకుని ఒకరి తర్వాత మరొకరిని చంపేశారు. కేసుల వివరాలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శనివారం మీడియాకు వెల్లడించారు.
బయటికి రాని మొదటి హత్య..
ఈ ఏడాది ఆగస్ట్ 16న వచ్చనూరులో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు ఉప్పులేటి భూదమ్మ(103) ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన మద్దూరి సాయి, ఇదే మండలం పోరండ్లకు చెందిన కిన్నెర రాజు, కొత్తపల్లికి చెందిన ఎల్కతుర్తి రాజు కలిసి వెళ్లారు. ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశాక ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు, బంగారు ముక్కుపుడకలను ఎత్తుకెళ్లారు.
వృద్ధాప్యం కారణంగా సహజంగానే మరణించిందని భావించి మృతురాలి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ ముగ్గురు కలిసి దోచుకెళ్లిన నగలను వచ్చనూరుకు చెందిన మానుకోల పవన్ సాయంతో గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన మణికంఠ అనే వ్యక్తికి అమ్మి నగదును పంచుకున్నారు.
మొదటి హత్య తరహాలోనే రెండోది..
భూదమ్మ హత్యపై ఎవరికీ అనుమానం రాకపోవడంతో నిందితులు మరో దోపిడీకి ప్లాన్ చేశారు. అదే గ్రామానికి చెందిన ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ(80) ఇంట్లోకి గత అక్టోబర్ 31న చొరబడి ఆమెకు ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఆమె ఒంటి ఉన్న వెండి కడియాలు, బంగారు నల్లపూసల గొలుసు, చెవికమ్మలను ఎత్తుకెళ్లారు. నగలలో కొన్నింటిని కరీంనగర్లో, మరికొన్ని హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు.
లచ్చవ్వ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం అలుగునూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్దూరి సాయి, కిన్నెర రాజు స్కూటీపై వెళ్తూ పోలీసులకు చిక్కారు. వారిని విచారించగా వచ్చనూర్లో జరిగిన రెండు హత్యలు తామే చేసినట్లు అంగీకరించారు.
అనంతరం మూడో నిందితుడు ఎల్కతుర్తి రాజును హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని క్యాన్సర్ ఆస్పత్రి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగలు కొనుగోలు చేసిన కనపర్తి మణికంఠ పరారీలో ఉన్నాడు. వారి దగ్గర టీవీఎస్ జూపిటర్ స్కూటీ, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, కాళ్ల వెండి కడియాలు, చేతి వెండి కడియాలు, 5 మొబైల్ ఫోన్లు, ఒక ఇనుప గొట్టం, స్టీల్ పట్టుకారును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ, ఎల్ఎండీ కాలనీ, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
