- రేపు సాయంత్రం 5 గంటల వరకే తుది గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలలో 2026–-27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలోని ఖాళీగా ఉన్న ‘సి’ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ స్పెషల్ స్ట్రే రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పున:ప్రారంభించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వన్ టైమ్ మెజర్ గా నవంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. గతంలో కేటగిరీ-బి కింద మాత్రమే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ ఎన్‌ఆర్‌ఐ సర్టిఫికేట్లు, అప్లికేషన్ కాపీని [email protected] మెయిల్ ఐడీకి పంపాలని వర్సిటీ స్పష్టం చేసింది.
హైకోర్టు ఉత్తర్వులు పొందిన అభ్యర్థులు కూడా సంబంధిత సర్టిఫికేట్లను నిర్దేశిత గడువులోగా ఇదే మెయిల్ కు పంపాల్సి ఉంటుంది. ఇక నీట్ యూజీ అర్హత సాధించి ఇప్పటివరకు మేనేజ్‌మెంట్ కోటాకు దరఖాస్తు చేసుకోని కొత్త అభ్యర్థులు రూ.12 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి https://tspvtmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా కేవలం ఎన్‌ఆర్‌ఐ సీట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చని, నవంబర్ 9 సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే ఈ-మెయిల్స్ లేదా దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని వర్సిటీ స్పష్టం చేసింది.
