- ఆరేండ్ల కింద కులాంతర వివాహం చేసుకున్న భర్త
- ఐదారు నెలలుగా మరో మహిళతో ప్రేమాయణం
- మనోవేదనతో సూసైడ్ వరంగల్ జిల్లా పాకాల సరస్సు వద్ద ఘటన
వరంగల్/నర్సంపేట, వెలుగు : ఇద్దరు బిడ్డలతో తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పాకాల సరస్సు వద్ద శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‍పర్తి మండలం బైరాన్‍పల్లికి చెందిన మమత (29), వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలికి చెందిన ఈరెల్లి సుమన్ ఆరేండ్ల కింద కులాంతర ప్రేమవివాహం చేసుకున్నారు.
వీరికి హరిణి (5), హారిక (4) కూతుర్లు ఉన్నారు. సుమన్ ట్రాక్టర్ డ్రైవర్‍గా, మమత నర్సంపేటలో ఓ ప్రైవేట్ హస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ జీవిస్తున్నారు. కాగా, సుమన్ ఐదారు నెలలుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై సుమన్‌కు పలుమార్లు పెద్దలు సర్దిచెప్పినా అతడి తీరు మారలేదు. మమతది ప్రేమవివాహం కావడంతో ఆమెకు కుటుంబ సభ్యుల సహకారంలేక, నమ్మించి మోసం చేసిన భర్తతో ఉండలేక తీవ్ర మనోవేదనకు గురైంది.
ఈ క్రమంలో శనివారం ఉదయం తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల పరిధిలోని పర్యాటక కేంద్రమైన పాకాల సరస్సు వద్దకు వెళ్లింది. పెద్దబిడ్డను వీపుపై కట్టుకుని, చిన్నబిడ్డను గుండెలకు హత్తుకుని నీటిలో దూకి సూసైడ్ చేసుకుంది. దీన్ని కాసేపటి తర్వాత గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి చేరుకున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ డీసీపీ అంకిత్ కుమార్, నర్సంపేట ఏసీపీ రవీందర్‍రెడ్డివిచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం నర్సంపేట మార్చురీ కేంద్రానికి తరలించారు. కాగా, పర్యాటక కేంద్రమైన పాకాల సరస్సు వద్ద సెక్యూరిటీ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి.
