జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

టోక్యో: జపాన్‎ను మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం (నవంబర్ 8) తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో షిజువోకా ప్రిఫెక్చర్ పశ్చిమ భాగంలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత  5.7గా నమోదైంది. భూకంప కేంద్రం సుమారు 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఐచి, నగానో, గిఫు ప్రిఫెక్చర్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాలు గజగజ వణికిపోయాయి. 

భూకంపనల ధాటికి ప్రభావిత ప్రాంతాల్లోని ఇండ్లు, దుకాణాల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రభావంతో కనీసం 22 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహయక చర్యలు చేపట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. 

రైల్వే మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భూకంప ప్రభావిత ప్రాంతంలో బుల్లెట్ రైలు సర్వీసులు తక్కువ వేగంతో నడుపిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భూప్రకంపనలతో పలు భవనాలు చిగురుటాకులా వణికిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.