వీరాపురం వీరయ్య పెద్ద జమీందారు. ఆయనకు వంద ఎకరాల్లో చేపల చెరువులు వున్నాయి. వాటిలో ప్రతి ఏటా రకరకాల చేపపిల్లలు పెంచి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. చేపల చెరువు సంరక్షణకు ముగ్గురు వ్యక్తులను రక్షణకు నియమించాడు. సుబ్బయ్య, రంగయ్య, పుల్లయ్యలు చేపలచెరువుల వద్ద కాపలాకాసేవారు.
వీరయ్య రెండు రోజులకు ఓ సారి వచ్చి చేపలు ఎలా ఉన్నాయో చూచి వెళ్ళేవాడు. పది రోజులకు ఓ సారి చేపలు పట్టి పెద్ద మొత్తంలో విక్రయించేవాడు. వీరయ్యకు లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. ఇది చూసిన సుబ్బయ్యకు డబ్బుపై కన్నుపడింది. తన కుమారుల చదువుకు చేసిన అప్పులు కళ్ళముందు కనిపించాయి. ఆ వడ్డీ ఎలా చెల్లించాలో దిక్కుతోచలేదు.
ఓ రోజు రాత్రంతా బాగా ఆలోచించి చేపలు తస్కరించాలనుకున్నాడు. రంగయ్య, పుల్లయ్యలు ఆద మరిచి నిద్ర పోతున్న సమయంలో సుబ్బయ్య వల తీసుకొచ్చి చేపల్ని పట్టి ఓ పెద్ద డ్రమ్ముల్లో దాచాడు. వాళ్లిద్దరూ లేవకముందే వాటిని సమీపంలోని ఏటి గట్టుకు చేర్చి ఓ హోటల్ యజమానికి అమ్మేశాడు. యాభై వేలు రూపాయలు డబ్బు వచ్చాయి.
అది చూసి మురిసిపోయిన సుబ్బయ్య తనకేమీ తెలియదన్నట్లు పాలు తాగిన పిల్లిలా అమాయకుడిలా కూర్చున్నాడు. మరుసటి రోజు వీరయ్య వచ్చి చెరువులో చేపలు తగ్గివుండటం చూసి “ చేపలు ఏమయ్యాయి? చెప్పండి? నేను ఓ హోటల్ యజమానికి టన్ను చేపలు ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు తగ్గాయి..ఏమి చేయాలి ? చెప్పండి..లేదా తీవ్ర చర్య తీసుకుంటాను..” అని హెచ్చరించాడు.
“సామీ..సామీ.. పిల్లులు వచ్చి చేపలు తినేస్తున్నాయి..”అని సమాధానం ఇచ్చాడు. సుబ్బయ్య. వీరయ్యకు అనుమానం వేసింది. రంగయ్య, పుల్లయ్యను పిలిచి “ నిఘా వేయండి..” అని ఆజ్ఞాపించాడు. ఆ రాత్రి వీరయ్య సైతం మారువేషం వేసుకొచ్చి చెరువు గట్టుపై నక్కాడు. యధావిధిగా రంగయ్య, పుల్లయ్య గుర్రుపెట్టి నిద్ర పోయారు. సుబ్బయ్య వలపట్టి చేపల్ని డ్రమ్ములో వేసాడు. మరుసటిరోజు హోటల్లో అమ్మేస్తుండగా పట్టుకున్నాడు.
“ఇదేమిటి ?” అని నిలదీశాడు వీరయ్య.
సుబ్బయ్య చేసిన దొంగ పనికి పనిలోనుంచి తీసివేశాడు. అప్పుల్లో కూరుకుపోయిన సుబ్బయ్య ఇప్పుడు తనకు ఏ పని దొరక్క అష్టకష్టాలు పడ్డాడు. పనిలో అప్రమత్తంగా లేని రంగయ్య, పుల్లయ్యకు సైతం జీతంలో కోత పెట్టాడు. అప్పటి నుంచి అబద్ధం చెబితే వచ్చే అనర్థం ఏమిటో తెలిసివచ్చింది సుబ్బయ్యకు. అతడిని చూసి జాగ్రత్త పడి పనిలో అప్రమత్తంగా వుంటూ ఆసామి వీరయ్య వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు పుల్లయ్య, రంగయ్యలు.
–బోగా పురుషోత్తం, తుంబూరు, తిరుపతి జిల్లా–
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
