Diwali Special: చీకటి వెలుగుల రంగేలీ..వెండితెరపై వెలుగుల జాతర

Diwali Special: చీకటి వెలుగుల రంగేలీ..వెండితెరపై వెలుగుల జాతర

దీపావళి అంటే దీపాల వెలుగులు... టపాసుల మోతలు... పిల్లల కేరింతలు! మరి వెండితెరపై దీపావళి అంటే అంతకుమించిన సందడి!  ఒకప్పుడు ‘దీపావళి దీపావళి... ఇంటింటా ఆనంద దీపావళి’ అంటూ ప్రేక్షకులను పలు సినిమాలు అలరించాయి. ఆ తర్వాత చీకటి వెలుగుల రంగేళీ... జీవితమే ఒక దీపావళి అంటూ జీవిత సత్యాన్ని బోధించిన పాటలు! 

 పండుగను కేవలం సంబరంగానే కాదు... ప్రేమకు, అనుబంధాలకు, ఆవేదనకు, ఆనందానికి ప్రతీకగా చూపించిన సినిమాలు ఎన్నో! తరాలు మారినా, సాంకేతికత మారినా ఆ పాటలు, ఆ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.  సినిమాల్లో దీపావళి ...చీకటి వెలుగుల రంగేళీ... జీవితమే ఒక దీపావళి అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ పాట వినగానే ప్రతి తెలుగు ప్రేక్షకుడి మనసులో పండుగ జ్ఞాపకాలు మెదులుతాయి. 

దీపావళి వచ్చిందంటే ఇళ్ల ముందు దీపాల వెలుగులే కాదు... రేడియోలు, టీవీల్లో ఈ పాట కూడా మార్మోగాల్సిందే! ఆత్రేయ కలం నుంచి జాలువారిన ఈ అద్భుత గీతం తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక గుర్తుగా నిలిచిపోయింది.

జీవితమే ఒక దీపావళి  పాటతో మొదలైన సినిమా పాటల జ్ఞాపకాల ప్రయాణం విచిత్ర బంధం 1972వ సంవత్సరంతో ప్రారంభం అయింది.అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ఈ పాటకు ఆత్రేయ సాహిత్యం, కేవీ  మహదేవన్ సంగీతం. ఘంటసాల, పి.సుశీల గానం కలగలిసి ఈ పాటను చిరస్థాయిగా నిలిపాయి. 

దీపాల వెలుగులను మానవ జీవితంలోని ఆశలు, ఆనందాలతో ముడిపెట్టిన పాట ఇది.1950వ సంవత్సరంలో విడుదలైన షావుకారు  సినిమాలో ఇంటింటా ఆనంద దీపావళి పాటలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పాటలో పండుగ సందడి కనిపిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉన్నప్పుడు దీపావళి వెలుగులు ఎలా ఉంటాయో... బంధాలు చెడినప్పుడు అదే పండుగ ఎలా చీకటిగా మారుతుందో దర్శకులు అద్భుతంగా చూపించారు.

పెళ్లి కానుక  సినిమాలో ‘ఆడే పాడే పసివాడా... ఆడేనోయి నీతోడ... ఆనందం పొంగేనోయి దీపావళి’ పాట ప్రత్యేక ఆకర్షణ. కథలో పరిస్థితులు మారినప్పుడు అదే పాటలోని భావం విషాదంగా మారుతుంది. పండుగలోని వెలుగులు, జీవితంలోని చీకటి వెలుగులకు ప్రతీకగా నిలుస్తాయి.సంఘర్షణ సినిమాలో సంబరాలో సంబరాలు... దీపావళి పండగ సంబరాలు పాట పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. 

సామాన్య ప్రజలు కూడా తమ స్థాయికి తగ్గట్టుగా దీపావళిని ఎంత ఆనందంగా జరుపుకుంటారో ఈ పాటలో కనిపిస్తుంది.1991లో వచ్చిన మామగారు సినిమాలో వెయ్యేళ్ల నిత్యమైన దీపావళి సినిమాలో  ‘ఇయ్యాలే అచ్చమైన దీపావళి... వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి’ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా రాజ్–కోటి సంగీతం అందించారు.

 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత బృందం ఆలపించారు.ముద్దుల మనవరాలు  చిత్రంలో ‘ఇన్నాళ్లకు వచ్చిందో దీపావళి... మమతల దీపావళి’ పాట ప్రత్యేక ఆకర్షణ. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, పండుగ సంబరాలను ఈ పాట గుర్తు చేస్తుంది.ఇంటింటి దీపావళి  సినిమాలో ‘కిలకిల జీవితం సాగనీ సాగనీ తీయగా’ పాట పండుగ ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ గీతంలో కుటుంబ సభ్యుల మధ్య సంతోషం, సందడి ప్రధానంగా కనిపిస్తాయి.

మర్చిపోని దీపావళి మధుర సన్నివేశాలు

తెలుగు సినిమాల్లో పాటలే కాదు సన్నివేశాల్లోనూ దీపావళి పంచు డైలాగులు పేలాయి. 1955వ సంవత్సరంలో విడుదలైన  దొంగరాముడు సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం హృదయానికి హత్తుకుంటుంది. దీపావళి పండుగ రోజున చెల్లికి ఆనందం కలిగించేందుకు రాము చేసే ప్రయత్నం కథలో కీలక మలుపుకు కారణమవుతుంది. 

పండుగ సంబరాల వెనుక కుటుంబ బాధ్యతలు, పేదరికం, ప్రేమను ఈ సినిమా చూపిస్తుంది.క్షేమంగా వెళ్లి లాభంగా రండి హాస్య చిత్రంలో దీపావళి కోసం చేసే హడావుడి నవ్వులు పూయిస్తుంది. భార్యల ముందు గొప్పలు చెప్పుకోవడానికి అప్పులు చేసి టపాసులు కొనడం...చివరకు ఆ అప్పులే సమస్యగా మారడం వినోదాత్మకంగా చూపించారు.

చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో దీపావళి సంబరాల మధ్య ఓ విషాద సంఘటన చోటుచేసుకోవడం కథకు భావోద్వేగాన్ని జోడిస్తుంది. పండుగ వాతావరణంలో కూడా సామాన్యుల జీవితాల్లో విషాదం ఎలా ప్రవేశిస్తుందో గుర్తుచేస్తుంది.

సినిమా పేర్లలోనూ దీపావళి

పాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలే కాదు సినిమా పేర్లలోనూ దీపావళి వచ్చింది. 1960వ సంవత్సరంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, సావిత్రి సత్యభామగా, కృష్ణకుమారి రుక్మిణిగా, ఎస్వీ రంగారావు నరకాసురుడిగా నటించిన దీపావళి సినిమా అప్పట్లో దీపావళి వెలుగులు విరజిమ్మింది. 

నరకాసుర వధ, దీపావళి పండుగ ప్రాశస్త్యం దీపావళి సినిమా ప్రధాన ఇతివృత్తం.2008వ సంవత్సరంలో వచ్చిన దీపావళి సినిమాలో వేణు తొట్టెంపూడి, ఆర్తి అగర్వాల్, మేఘనా నాయర్ నటించారు. ఈ చిత్రం హైదరాబాద్‌‌‌‌లో దీపావళి సందర్భంగా ఉగ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నే కథాంశంతో తెరకెక్కింది.ఈ రెండు సినిమాలు ఒకే పేరుతో వచ్చినా.. కథాంశాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి.

దీపావళి సినిమా పాటలు

  • 1. విచిత్ర బంధం (1972) – చీకటి వెలుగుల రంగేళీ... జీవితమే ఒక దీపావళి.
  • 2. షావుకారు (1950) – దీపావళి దీపావళి.. ఇంటింట ఆనంద దీపావళి.
  • 3. పెళ్లి కానుక (1960) – ఆడే పాడే పసివాడా... ఆనందం పొంగేనోయి దీపావళి.
  • 4. సంఘర్షణ (1983) – సంబరాలో సంబరాలు... దీపావళి పండగ సంబరాలు.
  • 5. మామగారు (1991) – ఇయ్యాలే అచ్చమైన దీపావళి... వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి.
  • 6. ముద్దుల మనవరాలు – ఇన్నాళ్లకు వచ్చిందో దీపావళి... మమతల దీపావళి.