కమల్ హాసన్ కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘దశావతారం’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. సుదీక్ష ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నవంబర్ 28న రీ -రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ‘దశావతారం’ అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో కమల్ హాసన్ ఏకంగా పది విభిన్న పాత్రల్లో నటించి తనదైన యాక్టింగ్ టాలెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఒక్కో పాత్రకు ఒక్కో ప్రత్యేకతను జోడిస్తూ, శరీర భాష నుంచి హావభావాల వరకు వైవిధ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. యాక్టింగ్, మేకప్, టెక్నికల్‌గా ఇలా అన్ని అంశాల్లోనూ ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాలం మారుతున్నా.. సినిమా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నా.. కమల్ హాసన్ నటనలోని ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరనిదే. అలాంటి అరుదైన నటనా వైభవాన్ని మరోసారి బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంటోంది.
